‘అమరావతి’లో కేంద్రం జోక్యం ఉండదు
అమరావతి అంశం అసలు కేంద్రం పరిధిలోకి రాదని..ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉండదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతంలో ఏపీలో రాజధాని అసలు అమరావతి ఉంటుందా? ఉండదా అన్న కొత్త చర్చ ప్రారంభం అయింది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతం ఇచ్చేలా ఉన్నాయి. దీంతో అందరూ అమరావతి అంశంపై ఆసక్తికరంగా చూస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ ను దేశ రెండవ రాజధాని చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా కిషన్ రెడ్డి ఖండించారు.
బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా ఎవరో తెలియదంటూ కెటీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు కిషన్ రెడ్డి. నడ్డా ఎవరో తెలియకుండా ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎలా కలిశారని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్లో సనత్నగర్ ఈఎస్ఐసీలో రూ.150 కోట్లతో కొత్త బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.