Telugu Gateway
Andhra Pradesh

అనంతపురం నుంచి ‘ఆంధ్రా కారు’

అనంతపురం నుంచి ‘ఆంధ్రా కారు’
X

అనంతపురం జిల్లా అంటే కరవుకు కేరాఫ్ అడ్రస్. ఎందుకంటే అత్యంత తక్కువ వర్షపాతం ఉండే జిల్లాల్లో అది ఒకటి. ఇప్పుడు అలాంటి కరువు జిల్లా వార్తల్లో నిలిచింది. ‘మేడిన్ ఇన్ ఆంధ్రా కారు’ గురువారం నాడు అనంతపురం జిల్లా నుంచే బయటికి వచ్చింది. జిల్లాలోని పెనుకొండ సమీపంలో కార్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసిన కియా మోటార్స్ సెల్టాస్ మోడల్ తొలి కారును ఆవిష్కరించింది. ఈ చారిత్రక ఘట్టంలో ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనాల్సి ఉన్నా..ఢిల్లీలో ఆయన పర్యటన జాప్యం కావటంతో మంత్రులు మాత్రమే హాజరయ్యారు. కియా మోటార్స్ 530 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 22 నుంచి ఏపీలో తయారైన కియా కార్ల అమ్మకం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సంస్థ ఎండీ కుంషీమ్ తెలిపారు.

దేశ వ్యాప్తంగా 206 షోరూమ్స్ ద్వారా ఈ కార్ల అమ్మకాలు జరపనున్నారు. బుకింగ్ ప్రారంభించిన రోజునే ఆరు వేల కార్లకు ముందస్తు బుకింగ్స్ వచ్చాయన్నారు. ఇప్పటి వరకూ 23 వేల మంది కార్లకు బుకింగ్స్ చేసుకున్నారని వెల్లడించారు. కియా రాకతో అనంతపురం జిల్లాకు కొత్త కళ వచ్చిందని చెప్పొచ్చు. కియా అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు అయితే ఈ ప్రాంతంలో అభివృద్ధి మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది. 13,500 కోట్ల పెట్టుబడులు పెట్టిన దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్‌ సంస్థ ప్రతి ఏటా 3 లక్షల కార్లను తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రతి 6 నెలలకు కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు వెల్లడించారు.

Next Story
Share it