Telugu Gateway
Politics

ఏపీని ఎలా విభజించారో మర్చిపోయారా?

ఏపీని ఎలా విభజించారో మర్చిపోయారా?
X

జమ్మూ కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన అంశంతోపాటు..రాష్ట్ర విభజన అంశంపై విపక్షాల అభ్యంతరాలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ ను దేశంలో సంపూర్ణంగా ఐక్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతం పూర్తిగా కేంద్ర పాలిక ప్రాంతంగా ఉండదని..అక్కడ సాదారణ పరిస్థితులు వచ్చిన వెంటనే పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. రక్తపాతం, ఉగ్రవాదానికి తావు లేని ప్రశాంత ప్రాంతంగా చూడటమే తమ లక్ష్యమని తెలిపారు. రానున్న ఐదేళ్లలో కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఎక్కువకాలం జమ్మూకాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చూడాలనుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా కశ్మీర్‌ విభజన బిల్లు విషయంలో ప్రతిపక్ష ఆరోపణలను ప్రస్తావిస్తూ.. అమిత్‌ షా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విజభన గురించి ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కారు ఎలా విభజించిందో అందరికీ తెలుసునని, తలుపులు మూసి, లైవ్‌ ప్రసారాన్ని నిలిపేసి నాడు సభలో విభజన బిల్లును ఆమోదింపజేశారని తప్పుబట్టారు.

కాశ్మీర్‌ విషయంలో తాము అలా చేయడం లేదని, ఈ బిల్లుపై అభ్యంతరాలు చెప్పుకోవడానికి ప్రతిపక్ష సభ్యులకు అవకాశమిచ్చామని తెలిపారు. కాశ్మీర్‌ ఒక భూతల స్వర్గమని, అది అలాగే ఉంటుందని, ఆర్టికల్‌ 370 రద్దుతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, పర్యాటక రంగం వృద్ధి సాధిస్తుందని, శాంతిభద్రతలు మెరుగుపడతాయని అమిత్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 370ని కొనసాగించడం వల్ల జమ్మూకశ్మీర్‌లో భారీ రక్తపాతం, హింస చోటుచేసుకుందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్‌ 370 కారణంగా జమ్మూ, కాశ్మీర్‌, లడఖ్‌ ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయని, ఈ ఆర్టికల్‌ వల్ల స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చే అధికారం కేంద్రానికి లేకుండాపోయిందని, దీని రద్దుతో రేపటి నుంచే జమ్మూకశ్మీర్‌లోని స్థానిక సంస్థలకు నిధులిస్తామని అమిత్‌ షా తెలిపారు.

పాక్‌ నుంచి వలస వచ్చిన మన్మోహన్‌సింగ్‌, ఐకే గుజ్రాల్‌ వంటి వారు మనదేశ ప్రధానులయ్యారని గుర్తు చేశారు. దేశానికి సంబంధించిన అంశం ఇదని, ఈ విషయంలో మతపరమైన రాజకీయాలు చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 370 వల్ల జమ్మూ ప్రజలు ఎన్నో అవమానాలకు గురయ్యారని, వారు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని బలంగా కోరుకుంటున్నారని అన్నారు. ఇన్నాళ్లు కాశ్మీర్‌ను మూడు కుటుంబాలే శాసించాయి, దోచుకున్నాయని పరోక్షంగా మెహబూబా ముఫ్తి, ఒమర్‌ అబ్దుల్లా, వేర్పాటవాద నాయకులను వేలెత్తిచూపారు. కొందరు నేతల అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్నామని, ఈ విచారణతో చలికాలంలోనూ వారికి చెమటలొస్తాయని చెప్పారు.

Next Story
Share it