Telugu Gateway
Andhra Pradesh

‘నవయుగా’ చేతిలోనే పోలవరం భవిష్యత్?!

‘నవయుగా’ చేతిలోనే పోలవరం భవిష్యత్?!
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టును ప్రమాదంలోకి నెడుతున్నారా?. అంటే ఔననే చెబుతున్నాయి అధికార వర్గాలు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుని..అవినీతి సొమ్మును రికవరి చేస్తే సరిపోయేదానికి ‘రివర్స్ టెండర్’ అంటూ ప్రాజెక్టును ప్రమాదంలోకి నెడుతున్నారని ఆ శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పుడు జగన్ సర్కారు కొత్తగా పిలవనున్న టెండర్ లో సివిల్ పనుల టెండర్ విషయానికి వస్తే పాత రేట్లతో పనులు చేయటానికి ఎవరూ ముందుకు వచ్చే అవకాశం లేదని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికీ..ఇప్పటికీ రేట్లలో చాలా తేడా ఉంది. ఈ విషయాన్ని గ్రహించే జగన్ సర్కారు పోలవరం విద్యుత్ ప్రాజెక్టు, సివిల్ వర్క్స్ పనులను ఒకే టెండర్ కింద పిలవాలని నిర్ణయించింది. దీని ద్వారా మిగులను చూపించి తాము ఇంత ఆదా చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది.

నిజంగా అలా జరిగితే ఓకే. కానీ విద్యుత్ ప్రాజెక్టును నవయుగా టెండర్ ద్వారానే దక్కించుకుంది. అయితే ఇందులో అంచనాలు పెంపు అడ్డగోలుగా ఉందని..పక్కా పథకం ప్రకారమే నవయుగాను తెరపైకి తెచ్చారనే విమర్శలు..ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా టెండర్ ద్వారా దక్కించుకున్న ప్రాజెక్టు. అదే పోలవరంలో అయితే నామినేషన్ పై పనులు అప్పగించారు. అదీ పాత రేట్లతో. ఇందులోనూ ఎన్నో మతలబులు ఉన్నాయి. నవయుగా సంస్థ విద్యుత్ ప్రాజెక్టు టెండర్ ను రద్దు చేయటాన్ని సవాల్ చేస్తూ పొరపాటున కోర్టును ఆశ్రయిస్తే ఇక ప్రాజెక్టు అటకెక్కినట్లే అని ఇంజనీర్లు చెబుతున్నారు. అయితే నవయుగా ఆ పని చేస్తుందా? లేదా అన్నది మాత్రం ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అందుకే పోలవరం ప్రాజెక్టు పనుల భవిష్యత్ నవయుగా చేతిలో ఉందని ఓ కీలక ఇంజనీర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సర్దుబాటు ధోరణితో కాకుండా బలవంతంగా నవయుగాను అటు పోలవరం పనులతో పాటు..విద్యుత్ ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

తాజాగా మంగళవారం నాడు హైదరాబాద్ లో జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సమావేశంలో కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలు జగన్ సర్కారుకు ఒకింత షాక్ లాంటివే. కొత్త టెండర్ వల్ల వ్యయం పెరిగితే అది రాష్ట్రమే భరించాలని..కేంద్రం భరించదని పీపీఏ స్పష్టం చేసింది. మరి ఇప్పుడు ఇది జగన్ సర్కారుకు ఓ పెద్ద సవాల్ గా మారనుంది. విద్యుత్ ప్రాజెక్టుల దగ్గర నుంచి పలు కాంట్రాక్ట్ లను రద్దు చేస్తూ ఒక రకంగా జగన్ సర్కారు పారిశ్రామిక, కాంట్రాక్ట్ వర్గాల్లో కల్లోలం రేపింది. ఈ తరుణంలో ఎవరు ప్రాజెక్టులు దక్కించుకోవటానికి ముందుకు వస్తారు?. జగన్ చెబుతున్నట్లు ఎంత మేరకు ప్రజాధనం వృధా అవుతుంది? లేదా రాష్ట్రంపై మరింత అదనపు భారం పడుతుందా?. ఈ విషయాలు అన్నీ తేలాంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

Next Story
Share it