Telugu Gateway
Andhra Pradesh

ఛైర్మన్ అయితే వచ్చారు...టీటీడీ బోర్డు మాత్రం లేదు

ఛైర్మన్ అయితే వచ్చారు...టీటీడీ బోర్డు మాత్రం లేదు
X

అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్ నియామకం జరిగి దాదాపు రెండు నెలలు కావస్తోంది. నూతన ఛైర్మన్ గా వై వీ సుబ్బారెడ్డి జూన్ 22న టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. త్వరలోనే బోర్డు నియామకం జరుగుతుందని ప్రకటించినా..ఇంత వరకూ అది కార్యరూపం దాల్చలేదు. గురువారం సాయంత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. వారం రోజులు పాటు అయన అక్కడే ఉంటారు. బోర్డు సభ్యుల నియామకం వస్తే బుధ, గురువారాల్లో రావాల్సి ఉంటుంది. లేదంటే మరో వారం రోజుల పాటు ఇది డౌటే అని చెబుతున్నారు. అత్యంత కీలకమైన టీటీడీ బోర్డు విషయంలో జాప్యం చేయటం సరికాదనే విమర్శలు విన్పిస్తున్నాయి.

కూర్పుపై భారీ కసరత్తు చేయాల్సి ఉంటే కనీసం కొంత మందితో అయినా బోర్డు వేసి..మిగిలిన ఖాళీలను తర్వాత భర్తీ చేసుకోవచ్చని..అలా కాకుండా మొత్తం బోర్డు నియామకాలను పెండింగ్ లో పెట్టడం సరికాదనే వాదన విన్పిస్తోంది. కాంగ్రెస్ లాంటి పార్టీ అయితే ప్రతిదానికి అధిష్టానం ఆమోదం అవసరం ఉంటుంది. కానీ జగన్ విషయంలో అలాంటిది ఏమీలేదు. ఆయన నిర్ణయమే ఫైనల్. అయినా సరే అత్యంత కీలకమైన బోర్డు విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్ధం కావటంలేదని దేవాదాయ శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. జగన్ మరి ఇప్పటికైనా పూర్తి స్థాయి బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేక అలా పెండింగ్ లో పెడతారా వేచిచూడాల్సిందే.

Next Story
Share it