Telugu Gateway
Andhra Pradesh

జీఎంఆర్ ప్రాజెక్టులపై జగన్ సాఫ్ట్ కార్నర్ ఎందుకు?

జీఎంఆర్ ప్రాజెక్టులపై జగన్ సాఫ్ట్ కార్నర్ ఎందుకు?
X

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలని కొంత మందినే టార్గెట్ చేశారా?. కొన్ని కంపెనీల విషయంలో ఔదార్యంగా ఉంటున్నారా?. ఏపీలోని అధికార వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ హయాంలో కేటాయించిన మచిలీపట్నం పోర్టును జగన్ సర్కారు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే ఏకపక్షంగా రద్దు చేసింది. దీనికి కారణం ఏమి చూపించారంటే పనులేమీ మొదలుపెట్టలేదని. ఇదే ప్రామాణికం అయితే జగన్ సర్కారు చాలా అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. జీఎంఆర్ కు వైఎస్ హయాంలోనే కాకినాడ ప్రత్యేక ఆర్ధిక మండలి (సెజ్)కు వేల ఎకరాల భూములు కేటాయించారు. కానీ ఇక్కడ రావాల్సిన స్థాయిలో పరిశ్రమలు రాలేదు. కానీ ఈ సెజ్ కు ఏపీ సర్కారు ఎన్నో వరాలు, రాయితీలు అందించింది. అయినా సరే కాకినాడ సెజ్ లో పారిశ్రామిక ప్రగతి చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీలేదు. అదే సమయంలో వైఎస్ హయాంలోనే కాకినాడ ప్రత్యేక ఆర్ధిక మండలి (కెఎస్ఈజెడ్) సొంత అవసరాల కోసం క్యాప్టివ్ పోర్టు ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. కానీ చంద్రబాబునాయుడి సర్కారు మాత్రం క్యాప్టివ్ పోర్టును అత్యంత వివాదస్పదమైన స్విస్ ఛాలెంజ్ మోడల్ ద్వారా వాణిజ్యపోర్టుగా మార్చింది.

దీనిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం నుంచి వేలాది ఎకరాల భూమిని కారుచౌకగా తీసుకుని కాకినాడ ప్రత్యేక ఆర్ధిక మండలిలో ఆశించిన స్థాయి ప్రగతి చూపించకపోయినా...వివాదస్పద స్విస్ ఛాలెంజ్ మోడల్ లో పోర్టును క్యాప్టివ్ నుంచి వాణిజ్య పోర్టుగా మార్చినా జగన్ సర్కారు మౌనంగానే ఉంది. అక్రమాలు అన్నింటిని సక్రమం చేస్తున్నట్లు చెప్పుకుంటున్న జగన్ జీఎంఆర్ విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారు. అదే సమయంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో కూడా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. పోటీ బిడ్డింగ్ లో ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ప్రాజెక్టును దక్కించుకున్న ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ని కాదని జీఎంఆర్ కోసం చంద్రబాబు ఏకంగా టెండర్ మోడలే మార్పించారు. ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి చెందిన సాక్షి పత్రికలో కూడా ఎన్నో కథనాలు వచ్చాయి. కానీ జగన్ ఈ ప్రాజెక్టు విషయంలో కూడా ఇంకా మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఏపీకి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ప్రాజెక్టు అత్యవసరం అని..ఈ విషయంలో ఏదో ఒక తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీలో పలు విమానాశ్రయాలు ఉన్నా అరకొర సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. గంట వ్యవధిలో ఓ ఐదారు విమానాలు వచ్చినా పార్కింగ్ చేసుకునే వెసులుబాటు ఏ విమానాశ్రయంలోనూ ఉండదు. విభజన తర్వాత గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధి విషయంలో చంద్రబాబు కూడా జాప్యం చేశారు. రాష్ట్రం పారిశ్రామికంగా పురోగమించాలంటే ఎయిర్ కనెక్టివిటి కూడా ఎంతో కీలకం అన్న విషయం తెలిసిందే. మరి చంద్రబాబు జీఎంఆర్ కోసం డిజైన్ చేసిన టెండర్ ను ఓకే చేస్తారా? లేక కొత్త ప్రాంతంలో కొత్త విమానాశ్రయానికి శ్రీకారం చుడతారా? వేచిచూడాల్సిందే. జగన్ భవిష్యత్ రాష్ట్ర అవసరాలపై దృష్టిపెట్టకుండా..పాత ఒఫ్పందాలు సమీక్షలు..రద్దులపైనే ఫోకస్ పెడుతున్నట్లు ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it