Telugu Gateway
Politics

తెలంగాణలో ఇంత నియంతృత్వమా?

తెలంగాణలో ఇంత నియంతృత్వమా?
X

‘నేనూ నా ఫ్యామిలీ’ ఇదే సీఎం కెసీఆర్ నినాదంలా ఉందని బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జె పీ నడ్డా వ్యాఖ్యానించారు. ఎప్పుడూ సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రి సచివాలయాన్ని కూలుస్తారా? అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా? రాచరికమా?, కేసీఆర్‌ ప్రభుత్వంలో అసలు మహిళలు ఎందుకు లేరని, ఇంతటి నియంతృత్వమా? అని నడ్డా ప్రశ్నించారు. వీటన్నింటికీ వచ్చే ఎన్నికల్లో సమాధానం చెప్పాలని, బీజేపీ తడాఖా చూపించబోతున్నామని జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనలో ఇళ్ల నిర్మాణాలకు నిధులు ఇచ్చినా తెలంగాణ వాడుకోలేకపోతోందని విమర్శించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వివిధ పార్టీల నేతలు బిజెపిలో చేరిన సందర్భంగా నడ్డా ప్రసంగించారు. బీజేపీ పాలన కోరుకుంటున్న రాష్ట్రం తెలంగాణ.. ఆ కల మనం సాకారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. .చట్టంలో లేకపోయినా మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఎయిమ్స్‌ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి తనకు ప్రత్యేకంగా చెప్పారని, తెలంగాణపై బీజేపీ అభిమానం ఏంటో ఎయిమ్స్‌ చెబుతోందన్నారు.

కెసీఆర్ కు కుడిచేత్తో ఇచ్చి ఎడమచేత్తో తీసుకోవడం కేసీఆర్‌ నైజమని విమర్శించారు. రూ.30 వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ను మరో రెండింతలు పెంచి ఇష్టారాజ్యం చేసేశారన్నారు. కాళేశ్వరం ఎంత పవిత్రమైన పేరు ఆ పేరు పెట్టుకుని ఎంత అవినీతి చేశారో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని, ఇది తెలంగాణను మోసం చేయడమే నడ్డా వ్యాఖ్యానించారు. హరితహారం పేరుతో కూడా కేసీఆర్‌ చేస్తోంది ప్రచారమే, మొక్కలు ఎక్కడ నాటారో చూపించాలన్నారు. కేసీఆర్‌వి అన్నీ ప్రచార ఆర్భాటాలే, కేసీఆర్‌ పాలనలో వినపడేది ఒకటి, కనపడేది ఒకటన్నారు. కేసీఆర్‌ది ముందు నుంచి ఇదే నైజమని, తెలంగాణలో ఆదివాసీలకు భూములు ఇస్తామన్నారని, దళితులను సీఎం చేస్తానన్నారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందని.. తెలంగాణ బాధపడిందని, టీఆర్‌ఎస్‌ నుంచి కూడా బీజేపీలోకి వస్తున్నారని నడ్డా వెల్లడించారు.

బీజేపీలోకి వలసలు చూసి.. టీఆర్‌ఎస్‌కు కడుపు మండుతోందని నడ్డా ఎద్దేవా చేశారు. రజాకార్లలో పోరాడి గెలిచిన గడ్డపైకి రావడం ఆనందాన్ని ఇస్తుందన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నిజాంపై తెలంగాణ ప్రజలు అలుపెరుగని పోరాటం చేశారని గుర్తుచేశారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే సత్తా కేవలం బీజేపీకే ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ స్వప్రయోజనాలే ముఖ్యమని.. దేశ ప్రయోజనాలు అవసరం లేదని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు చేయాలని దేశ ప్రజలు కోరుకున్నారని.. అందుకే తమ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుందని చెప్పారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆర్టికల్‌ 370ని ఇంతకాలం కొనసాగించారని ఆరోపించారు. ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండకూడదన్నారు. అందుకే ఒక దేశం-ఒకే రాజ్యాంగం విధానాన్ని మోదీ అమలు చేసి చూపించారని కొనియాడారు. ట్రిపుల్‌ తలాక్‌ రద్దుతో చారిత్రక తప్పిదాన్ని సరిచేశామని పేర్కొన్నారు. తెలంగాణలో 3లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు.

Next Story
Share it