Telugu Gateway
Politics

కాశ్మీర్ ప్రజల విముక్తికోసం ప్రాణాలైనా అర్పిస్తా

కాశ్మీర్ ప్రజల విముక్తికోసం ప్రాణాలైనా అర్పిస్తా
X

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం నాడు లోక్ సభ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ ప్రజల విముక్తి కోసం తన ప్రాణాలైనా అర్పిస్తానని షా పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకె) కూడా జమ్మూకాశ్మీర్ లో అంతర్భాగమే అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్‌ పునర్విభజన బిల్లును అమిత్‌ షా మంగళవారం లోక్‌సభ ముందుకు తీసుకువచ్చారు. ఆర్టికల్‌ 370 రద్దుపై కూడా కేంద్రమంత్రి లోక్‌సభలో ప్రకటన చేశారు. చర్చలో భాగంగా కాంగ్రెస్‌ పక్షనేత అధీర్‌ రంజన్‌ చౌదరీ మాట్లాడుతూ.. కాశ్మీర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నియమాలను పాటించలేదని విమర్శించారు. కాశ్మీర్‌ మొదటి నుంచీ దేశ అంతర్గత వ్యవహారమని, ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఇది ద్వైపాక్షిక అంశమని పేర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. కాశ్మీర్‌ అంతర్గత వ్యవహారమా? లేక ద్వైపాక్షిక వ్యవహారమా? అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అధీర్‌ రంజన్‌ వ్యాఖ్యలపై అమిత్‌ షా తీవ్రంగా స్పందించారు. కాశ్మీరీలకు ఈ పరిస్థితికి రావడానికి కాంగ్రెస్‌ చేసిన తప్పిదాలే కారణమని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని, దానికి ఇతర దేశాల మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు. కాశ్మీర్‌ భారత సమాఖ్యలో భాగమేనన్న అమిత్‌ షా.. ఆ విషయం రాజ్యాంగంలో కూడా ఉందని గుర్తుచేశారు. కాశ్మీర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న పార్లమెంట్‌కు పూర్తిస్థాయి అధికారం ఉందని తెలిపారు. ఆర్టికల్‌ 370, 35ఏ రద్దుతో జమ్మూకశ్మీర్‌కు ప్రయోజనం చేకూరుతుందని, ఆర్టికల్‌ 370 రద్దు తీర్మానం, జమ్మూకశ్మీర్‌ విభజన బిల్లుల ఆమోదానికి సభలో సహకరించాలని అమిత్ షా కోరారు.

Next Story
Share it