Telugu Gateway
Andhra Pradesh

రాజధానిపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

రాజధానిపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు
X

ఏపీ నూతన రాజధాని అమరావతిపై బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత వైసీపీ వైఖరి చూస్తుంటే అమరావతి నుంచి రాజధానిని మార్చేలా ఉందని వ్యాఖ్యానించారు. రాజధాని మారిస్తే రైతులు నష్టపోతారని వ్యాఖ్యానించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని జీవీఎల్ కోరారు. ఆయన బుధవారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపులతో నిర్ణయాలు ఉండకూడదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి భవ్యంగా నిర్మించామని చెప్పుకోవడంలో అర్థం లేదని విమర్శించారు. స్విస్ ఛాలెంజ్ పేరుతో సింగపూర్ రాజధాని నిర్మాణం పేరిట వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధుల్లో కొద్దిగా ఖర్చుపెట్టి మిగతా మొత్తం జేబులో వేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం..కేంద్ర ప్రభుత్వం సూచనలతో చేసేది కాదని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి 5 వేల ఎకరాలు సరిపోతాయని.. అయితే అవసరానికి మించి అమరావతిలో భూమిని సేకరించారని ఆరోపించారు. చదరపు అడుగుకు పదివేల రూపాయలు ఖర్చుచేసి ప్రజాధనాన్ని లూటీ చేశారని గత ప్రభుత్వాన్ని విమర్శించారు.

ప్రజాధనం లూటీకి సంబంధించి ప్రభుత్వం వద్ద అనేక ఆధారాలు ఉన్నాయని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అమరావతి పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. కంపెనీలకు వ్యక్తులకు చౌక ధరకు పెద్ద ఎత్తున రైతుల భూములను కట్టబెట్టారు. గత ప్రభుత్వం హయాంలోనే పోలవరంలో అవినీతి జరిగింది. 5800 కోట్ల హెడ్ వర్క్స్ పనులను మూడు కంపెనీలకు ఇచ్చారు. ఇందులో భాగంగా 2346 కోట్ల రూపాయలు హెడ్ వర్క్స్ పనుల్లో అధికంగా చెల్లించారని నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. ఎవరు చెబితే అధిక చెల్లింపులు చేశారో బయటికి చెప్పాలి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్లు అందరికీ ముందుగానే చెల్లింపులను పూర్తి చేశారు. గత ప్రభుత్వం సమయంలో అనేక అక్రమాలు జరిగాయి. అవినీతి, అక్రమాలు జరిగినచోట చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలో భూములు తమ అస్మదీయులకు చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది.

Next Story
Share it