Telugu Gateway
Politics

ఈటెల సంచలన వ్యాఖ్యలు..టీఆర్ఎస్ లో కలకలం

ఈటెల సంచలన వ్యాఖ్యలు..టీఆర్ఎస్ లో కలకలం
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సీనియర్ నేత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా పార్టీలోని కొంత మంది అగ్రనేతలు ఆయనకు వ్యతిరేకంగా ఎంపిక చేసిన మీడియాలో వ్యతిరేక ప్రచారం చేయించుతురన్నారనే అభిప్రాయంతో ఉన్న ఈటెల గురువారం నాడు ఓ సభలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము గులాబీ జెండా ఓనర్లం అని వ్యాఖ్యానించారు. తాను పార్టీలోకి మధ్యలో వచ్చినవాడిని కాదన్నారు. చిల్లర ప్రచారాలపై సమాధానం చెప్పాల్సిన అవసరంలేదన్నారు. తనకు మంత్రి పదవి ఎవరి బిక్షా కాదని వ్యాఖ్యానించారు. తాను బీసీ కోటాలో మంత్రి పదవి ఎప్పుడూ కోరలేదన్నారు. ధర్మాన్ని, న్యాయాన్ని ఎప్పుడూ మోసం చేయలేరని అన్నారు. దొంగలు, మోసగాళ్ళు ఒక్కసారి మాత్రమే మోసం చేయవచ్చన్నారు.తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడామని తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈటెల ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ శాఖకు సంబంధించి సీఎం కెసీఆర్ దగ్గర జరిగిన సమావేశం వివరాలను ఈటెల రెవెన్యూ శాఖ నాయకులకు చెప్పినట్లు పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగిస్తారంటూ ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో మంత్రి ఈటెల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈటెల రాజేందర్ మూడున్నర కోట్ల తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవ బావుటా ఎగరేసిన బిడ్డ. చచ్చినా పర్వాలేదు అని తెలంగాణ జెండా వదిలిపెట్టకుండా కొట్లాడినం. లక్షలాది మంది ప్రజలతో ఇంటరాక్ట్ అయి ఉద్యమాన్ని నడిపిన వాళ్లం..గులాం జెండా ఓనర్లం మేం..ఓనర్లం. గులాబీ జెండాను తెలంగాణలో గుబాళింపచేసినవాళ్ళం. మేం ఓనర్లం తప్ప..అడుక్కునే వాళ్లం కాదు.అధికారం శాశ్వతం కాకపోవచ్చు...న్యాయం శాశ్వతం..ధర్మం శాశ్వతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా నెలకొన్న అసమ్మతి ఈటెల వ్యాఖ్యల ద్వారా బహిర్గతం అయిందనే అభిప్రాయం ఆయన వ్యాఖ్యల ద్వారా వ్యక్తం అవుతోంది. ప్రజలే చరిత్ర నిర్మాతలు..అని వ్యక్తులు కాదన్నారు. మరి ఈటెల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.ఎవరు హీరో..ఎవరు జీరోనో త్వరలోనే తెలుస్తుంది. నేను ఎప్పుడూ వెలిగే దీపాన్నే అంటూ వ్యాఖ్యానించారు.తాను ఇళ్లు కట్టుకుంటే ఎందుకు అంత కక్ష అని ప్రశ్నించారు.

Next Story
Share it