ధిక్కరించి...డీలాపడిపోయిన ఈటెల!

‘మంత్రి పదవి నాకు బిక్ష కాదు. పదవి కోసం కులం పేరుతో ఎప్పుడూ కొట్లాడలేదు. తెలంగాణ ఆత్మగౌరవం కోసమే పోరాడా’. ఇవీ హజూరాబాద్ సభలో మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు. వీటితోపాటు నేరుగా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ కు సవాల్ విసిరిన రీతిలో మాట్లాడిన ఆయన సమావేశం ముగిసిన తర్వాత కొద్ది గంటలకే మీడియాకు ఓ వివరణ పంపారు. ఈటెల వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా రావటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అంతే ఈటెల నుంచి ఓ వివరణ లాంటి ప్రకటన వచ్చింది. దీంతో కెసీఆర్ ను ధిక్కరించినట్లు మాట్లాడిన ఈటెల వెంటనే డీలాపడిపోయిన చందంగా మారింది. మంత్రి పదవి నాకు బిక్ష కాదు అని ఈటెల అన్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఆషామాషీ ప్రకటన కాదు. ఎందుకంటే మంత్రులెవరూ కూడా నోరెత్తి మాట్లాడటం లేదు. గతంలో ఇలా మాట్లాడిన ఒకరిద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. ఈ తరుణంలో ఈటెల వ్యాఖ్యలు పార్టీలో నెలకొన్న అసంతృప్తిని బహిర్గతం చేశాయనే వ్యాఖ్యలు వచ్చాయి. అయినా సరే పార్టీలో ఒక్కసారిగా ఈటెల కలకలం రేపారు. వీడియోల సాక్షిగా ఈటెల వ్యాఖ్యలు ఉన్నా ఆయన వివరణ మాత్రం ఒకింత విచిత్రంగానే ఉందని చెప్పొచ్చు.
ఈటెల పంపిన వివరణ ఇలా ఉంది. ‘హుజురాబాద్‌లో కాంగ్రెస్ నాయకుడు కాసిపేట శ్రీనివాస్ చేరిక సందర్భంగా నేను చేసిన ప్రసంగాన్ని కొన్ని వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలోని కొన్ని వర్గాలు వక్రీకరించాయి. ఇది సరికాదు. నేను గులాబీ సైనికుడిని. మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముమ్మాటికీ గులాబీ జెండానే ఎగురుతుంది. నేను పార్టీలో చేరిననాటి నుంచి.. నేటి వరకు గులాబీసైనికుడినే. మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. ఇటీవల కాలంలో కొన్ని వార్తా పత్రికలు, సోషల్ మీడియాలో మా పార్టీ అంటే గిట్టనివాళ్లు, నా ఎదుగుదలను ఓర్వలేనివారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఒక కులానికి ప్రతినిధిని అన్నట్టు, డబ్బులకు ఆశపడే వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే నేను ఈ రోజు హుజురాబాద్‌లో మాట్లాడాను. చిల్లరవార్తలు వద్దని చెప్పాను. తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యే నాటికే నేను పది లక్షల కోళ్ల ఫారానికి యజమానినని చెప్పిన.
కమలాపుర్ (ప్రస్తుత హుజురాబాద్) నియోజకవర్గానికి నన్ను పంపించి, ఇక్కడ పోటీచేయించి గెలిపించింది మా నాయకుడు కేసీఆరే. ఇదే విషయాన్ని కూడా చెప్పా. మేము గులాబీ సైనికులమని చెప్పిన. రాజకీయాల్లో సంపాదించుకోవడానికి రాలేదు.. నేను పార్టీలో, ఉద్యమంలో చేరేనాటికి పారిశ్రామికవేత్తనని చెప్పిన. ఓ పార్టీనాయకుడు ఇటీవల పత్రికలో వచ్చిన కథనంపై స్పందించాలని వేదికపై కోరడంతో ఆ పత్రికపై నేను చేసిన కామెంట్లపై రంధ్రాన్వేషణ చేస్తున్నారు. ఇది సరికాదు. ఆనాడు పార్టీ మారాలని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అనేక రకాలుగా ఒత్తడి తెచ్చినా లొంగని వ్యక్తి ఈటల రాజేందర్. ఈ ఉద్యమ పుణ్యానే నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన. నిరాధారమైన వార్తలను ప్రసారం చేయడం ఆపాలి, సోషల్ మీడియా సంయమనంతో ఉండాలి. నా ప్రసంగపాఠాన్ని పూర్తిగా చూడండి.’ అని సుదీర్ఘ వివరణ ఇచ్చారు.