Telugu Gateway
Politics

కాంగ్రెస్ లో ‘కాశ్మీర్ కల్లోలం’

కాంగ్రెస్ లో ‘కాశ్మీర్ కల్లోలం’
X

కాంగ్రెస్ పార్టీ బహుశా ఇంత గందరగోళంలో ఎప్పుడూ ఉండి ఉండదు. ఓ వైపు పార్టీకి అధ్యక్షుడు లేడు. అత్యంత కీలకమైన, దేశంపై ప్రభావం చూపే కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ విభజన వంటి కీలక అంశాలపై ఎలాంటి వైఖరి తీసుకోవాలో తెలియని గందరగోళం. పార్టీ అధికారిక స్టాండ్ ఒకటి..నేతల మాటలు మరొకటి. ఏకంగా లోక్ సభలో ఆ పార్టీ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి అసలే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని మరింత సంక్షోభంలోకి నెట్టారు. కాశ్మీర్ అంతరంగిక సమస్య కాదు..ద్వైపాక్షిక సమస్య అంటూ అధిర్ రంజన్ చౌదరి చుక్కానిలేని నావలాగా సాగుతున్న పార్టీని నిండా ముంచేశారు. అందుకే సీడబ్ల్యూసీలో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ చీప్ విఫ్ తన పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

ఇప్పుడు ఏకంగా రాహుల్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన జ్యోతిరాదిత్య సింథియా కూడా ఆర్టికల్ 370 రద్దు విషయంలో బిజెపి సర్కారు నిర్ణయాన్ని సమర్ధించారు. చేసిన విధానం బాగాలేదు కానీ..కేంద్రం నిర్ణయం కరెక్ట్ అని కుండబద్దలు కొట్టారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల మూడ్ ప్రకారం ముందుకెళితేనే మనుగడ సాగించగలదు. కానీ ప్రజల మూడ్ కు భిన్నంగా వెళితే ఎవరైనా ఎదురీదాల్సిందే. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మోడీ, అమిత్ షాలు విసిరిన ఈ సవాల్ ఇప్పట్లో ఆ పార్టీని మరింత కోలుకోకుండా దెబ్బతీసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకే సైనిక పహరాలో ఉన్న జమ్మూ కాశ్మీర్ లో అంతా ప్రశాంతంగానే ఉందని చెబుతున్నా...కాంగ్రెస్ పార్టీలో మాత్రం కల్లోలం మొదలైంది. ఇది ఎప్పటికి చల్లారుతుందో తెలియని పరిస్థితి ఆ పార్టీలో నెలకొంది. రాజ్యసభలో సైతం కాంగ్రెస్ సభ్యులు కొంత మంది పార్టీ వైఖరిని తప్పుపట్టారు.

Next Story
Share it