Telugu Gateway
Politics

కాంగ్రెస్ కు ఊహించని షాక్

కాంగ్రెస్ కు ఊహించని షాక్
X

సంచలన నిర్ణయాలతో కేంద్రంలోని బిజెపి దేశ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తగా..కాంగ్రెస్ పార్టీకి మాత్రం షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. దేశ వ్యాప్తంగా బిజెపి నిర్ణయానికి విశేషమైన మద్దతు లభిస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజాభిప్రాయానికి భిన్నంగా వెళుతున్నట్లు కన్పిస్తోంది. ఇదే ఆ పార్టీలో కలకలం రేపేందుకు కారణం అవుతోంది. ఈ పరిణామాలతో ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై తమ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్‌ విప్‌ భువనేశ్వర్ కలిత రాజీనామా చేశారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆర్టికల్‌ 370పై కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం ఆత్మహత్యాసదృశ్యంగా ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సైతం ఆర్టికల్ 370 ఏదో ఒకరోజు రద్దవుతుందని అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం పార్టీ సిద్ధాంతాలను మర్చిపోయిందని విమర్శించారు. ఆర్టికల్‌ 370 రద్దు బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీలందరికీ విప్ జారీ చేయాలని తనను ఆదేశించారని, ఈ విప్‌ దేశ మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుందన్న ఉద్దేశంతో విప్ జారీ చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేక రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. భువనేశ్వర్ కలిత అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇది ఆ పార్టీ నేతలను షాక్ కు గురిచేసింది.

Next Story
Share it