Telugu Gateway
Politics

చిదంబరం అరెస్ట్

చిదంబరం అరెస్ట్
X

సంచలనం. కేంద్ర హోం, ఆర్ధిక శాఖల మాజీ మంత్రి పి. చిదంబరం అరెస్ట్ అయ్యారు. బుధవారం రాత్రి సరిగ్గా 9.47 గంటల నిమిషాలకు సీబీఐ అధికారులు చిదంబరాన్ని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో బుధవారం నాడు అంతా హైడ్రామా జరిగింది. ఇరవై నాలుగు గంటలు ఎవరికీ చిక్కకుండా అదృశ్యం అయిన కేంద్ర మాజీ మంత్రి సాయంత్రం సడన్ గా కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లో ప్రత్యక్షం అయి మీడియా ముందుకు వచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని..అసలు ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ లో తన పేరు లేదని..తమ కుటుంబానికి అసలు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మీడియా సమావేశం తర్వాత ఆయన నివాసానికి వెళ్లిపోయారు. వెంటనే సీబీఐ, ఈడీ బృందాలు కూడా వెంటనే చిదంబరం నివాసానికి చేరుకున్నాయి.

ఢిల్లీ పోలీసుల సాయంతో విచారణ సంస్థలు చిదంబరం ఇంట్లోకి ప్రవేశించాయి. ఆ సమయంలో చిదంబరం తన ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని అధికారులకు అందుబాటులోకి రాలేదనే వార్తలు వెలువడ్డాయి. కాంగ్రెస్ కార్యాలయం వద్ద..చిదంబరం నివాసం వద్ద సీబీఐ అధికారుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ దశలో కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ కూడా జరిగింది. తొలుత మీడియాతో మాట్లాడిన చిదంబరం తాను నిన్న రాత్రంతా తాను తన న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతూ గడిపానని చెప్పారు. అరెస్ట్‌ నుంచి తక్షణ ఉపశమనం కల్పించాల్సిందిగా ఆయన చేసుకున్న అప్పీల్‌ను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది.

చిదంబరం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ శుశ్రవారం విచారణకు రానుంది. చిదంబరం అరెస్ట్‌ కు సీబీఐ రంగం సిద్ధం చేసిన క్రమంలో గడిచిన 24 గంటల నుంచీ ఆయన అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు చిదంబరం దేశం విడిచి వెళ్లకుండా ఆయనపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఇక 2007లో ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులు సమకూరడానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ) ఆమోదముద్ర వేయడంలో అప్పటి ఆర్థిక మంత్రిగా నిబంధనలకు విరుద్ధంగా పచ్చజెండా ఊపారని చిదంబరం అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో విదేశీ నిధుల రాకకు ఎఫ్‌ఐపీబీ ఆమోదం లభించడం వెనుక అవకతవకలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి.

Next Story
Share it