Telugu Gateway
Politics

టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేనిపై కేసు నమోదు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేనిపై కేసు నమోదు
X

యరపతినేని శ్రీనివాసరావు. అధికారంలో ఉండగా గుంటూరు జిల్లాలో చక్రం తిప్పిన నేత. అంతే కాదు అక్రమ మైనింగ్ కు సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వ పెద్దల అండతో అక్రమ మైనింగ్ కేసుల నుంచి ఇంత కాలం నెట్టుకుంటూ వచ్చారు. తాజాగా ఆయనపై పోలీసు కేసు నమోదు అయింది. కోర్టు ఆదేశాలతో ఇప్పుడు టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా యరపతినేనితో పాటు,ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 12 మందిపై కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదు అయిన వారి జాబితాలో మైనింగ్‌ ఏడీ జగన్నాధరావు, ఆర్డీవో మురళీ, సీఐ హనుమంతావులపై కూడా కేసు నమోదు చేశారు.

గతంలో అక్రమ మైనింగ్ తవ్వకాలపై గురవాచారి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దాంతో తనపై వ్యతిరేకంగా కేసు పెట్టాడనే కోపంతో యరపతినేని.. గురవాచారిని కాళ్లు, చేతులు విరిగేలా కొట్టించాడు. తనపై జరిగిన దాడి గురించి గురవాచారి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టినా వారు పట్టించుకోలేదు. దీంతో చేసేది ఏమీ లేక గురవాచారి హైకోర్టులో ప్రైవేట్‌ కేసు వేశారు. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు ఆదేశాలతో యరపతినేనితో సహా రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ అధికారులపై కేసుల నమోదయ్యాయి.

Next Story
Share it