Telugu Gateway
Andhra Pradesh

బొత్స మాటలు..చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్లేనా?!

బొత్స మాటలు..చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్లేనా?!
X

మాజీ ముఖ్యమంత్రి , ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ క్లీన్ చిట్ ఇచ్చారా?. వైసీపీ వాదనను అడ్డంగా ఖండించారా?. మంగళవారం నాడు ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది. గత కొన్నేళ్ళుగా వైసీపీ చేసిన విమర్శలను బొత్స ఒక్క దెబ్బతో కొట్టిపడేసినట్లు అయింది. రాజధాని అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఇప్పుడే ఏపీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడిన మాటలకు పూర్తి భిన్నంగా ఇప్పుడు బొత్స మాట్లాడటంతో ఈ వ్యవహారం ఖచ్చితంగా రాజకీయ రంగు పులుముకోవటం ఖాయంగా కన్పిస్తోంది. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ అంచనా వ్యయాలను అప్పటి చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా పెంచేసి చంద్రబాబునాయుడు దోచుకున్నారని ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ పదే పదే ఆరోపించింది. బయట మార్కెట్ రేటుకు..తాత్కాలిక సచివాలయంతోపాటు ఇతర భవనాల నిర్మాణ వ్యయాలను అడ్డగోలుగా పెంచారని వైసీపీ ఆరోపించింది. ఇఫ్పుడు ఇతర ప్రాంతాలతో పోలిస్తే అమరావతిలో నిర్మాణ వ్యయం ఎక్కువ అని బొత్స సత్యనారాయణ సూత్రీకరిస్తున్నారు. అంటే గతంలో చంద్రబాబు చేసిన రేట్లను పరోక్షంగా సమర్ధించినట్లు అయింది కదా?.

ఇదే కారణం చూపి అమరావతిలో రాజధాని ఉండబోదని సంకేతాలు ఇస్తున్నారా?. ఎన్నికల ముందు కూడా అప్పటి అధికార టీడీపీ జగన్ అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తారని ప్రచారం చేసింది. అయితే దీనికి అప్పట్లో వైసీపీ గట్టి కౌంటర్ ఇస్తూ..చంద్రబాబు హైదరాబాద్ లో ఇళ్ళు కట్టుకున్నారు కానీ..అమరావతిలో కట్టుకోలేదని..కానీ జగన్ మాత్రం అమరావతిలో ఇళ్ళు కట్టుకున్నారని వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. మరి అమరావతిలో ఇళ్ళు కట్టుకున్న జగన్ అక్కడ నుంచి రాజధానిని తరలిస్తారా?. మొత్తానికి మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అన్ని రకాలుగా వైసీపీని ఇరకాటంలోకి నెట్టేసేలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it