సుజనా భూముల జాబితా బయటపెట్టిన బొత్స
‘అమరావతి’ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సవాళ్ళు..ప్రతి సవాళ్ళ మధ్య అమరావతి రాజకీయం మరింత వేడెక్కుతోంది. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి, ఆయన బినామీలకు అమరావతిలో భూమలు ఉన్నాయని మంత్రి బొత్స ఆరోపిస్తే...చేతనైతే ఆ వివరాలు చెప్పాలని..తనకు రాజధానిలోని 28 గ్రామాల్లో ఎకరం భూమి కూడా లేదని సుజనా ప్రతి సవాల్ విసిరారు. దీంతో తాజాగా సుజనా చౌదరికి సంబంధించి కొన్ని భూముల వివరాలను వెల్లడించారు బొత్స. రాజధాని ప్రాంతంలో భూముల్లేవంటూ సుజనా అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. సుజనాచౌదరి అల్లుడు జితిన్‌కుమార్ పేరుతో ఉన్న కలింగ గ్రీన్ టెక్ కంపెనీ పేరుమీద 110 ఎకరాలు ఉన్నాయన్నారు. సుజనా చౌదరికి ఉన్న 120 కంపెనీల్లో ఇది ఒకటని చెప్పారు. చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో 110 ఎకరాలు ఉందన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆయన సోదరుడి కుమార్తె యలమంచిలి రుషికన్య పేరుమీద వీర్లపాడు మండలం గోకరాజుపాలెంలో 14 ఎకరాలు ఉందన్నారు.
ఒక్క ఎకరా చూపించమన్న సుజనా చౌదరికి 124 ఎకరాలు వారి కుటుంబాల పేరు మీద ఉన్నట్లు చూపించానన్నారు. చంద్రబాబు నాయుడు తన వియ్యంకుడు కు వియ్యంకుడు అయిన విబిసి రామారావుకు 493 ఎకరాలను ప్రభుత్వ భూమిని ఎకరా లక్ష రూపాయలకు ఇచ్చారు, ఆ తర్వాత దానిని రాజదాని పరిధిలోకి తెచ్చారు. ల్యాండ్ పూలింగ్ కింద కొంత మంది పేర్లపై 25 వేల చదరపు గజాల భూమి ఉంది. రాజధానిలో ఎవరికి ఎన్ని భూములు ఉన్నాయో మొత్తం బయట పెడతామని బొత్స వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రాజధానిపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాజధాని ప్రాంత రైతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర రాజధాని ఒక ప్రాంతానికికో, ఒక సామాజిక వర్గానికో లేదా రాజకీయ నాయకుల సొంతం కాదని మరోసారి పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య తారతమ్యం రాకూడదనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిమతమని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలిపారు. టీడీపీ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. పెయిడ్ ఆర్టిస్టులతో టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుంటే సుజనా చౌదరి కూడా అదే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. విషయం ఏదైనా ఉంటే సూటిగా, బాధ్యతగా మాట్లాడాలని సుజనా చౌదరికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసి తెలంగాణలో పెట్టుబడులు చూస్తున్నామని యనమల రామకృష్ణుడు, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ చేస్తున్నామని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.