విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు..జగన్ కు జపాన్ రాయభారి లేఖ
ఏపీ సర్కారు తలపెట్టిన విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాల సమీక్ష ఇంకా దుమారం రేపుతూనే ఉంది. ఇఫ్పటికే ఈ అంశంపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితోపాటు ఆ శాఖ కార్యదర్శి కూడా లేఖలు రాశారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి సర్కారు సమీక్షతో ముందుకెళతామని ప్రకటించింది. తాజాగా భారత్ లో జపాన్ రాయభారి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఇఫ్పటికే పూర్తయిన..ఖరారైన ఒప్పందాలను సమీక్షిస్తామనటం విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని భారత్ లో జపాన్ రాయబారి కెంజి హిరామత్సు జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఒఫ్పందాల సమీక్షకు సంబంధించి పలు విదేశీ పెట్టుబడిదారులతో పాటు..జపాన్ కంపెనీలు కూడా పరిస్థితిని మదింపు చేస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ లోని రెన్యువల్ ఎనర్జీ రంగంలో పలు విదేశీ సంస్థలు పెట్టుబడి పెట్టాయి.
అందులో ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, యూరప్ వంటి దేశాలు ఉన్నాయి. నేరుగా జపాన్ పెట్టుబడులు ఈ రంగంలో లేకపోయినప్పటికీ ఏపీలో పలు రంగాల్లో ఆ దేశ పెట్టుబడులు ఉన్నాయి. అయితే దేశంలో జపాన్ భారీ ఎత్తున ఈ రంగంలో పెట్టుబడులు పెట్టింది. జపాన్ ఎంబసీ కూడా ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని స్పష్టంగా చేసినట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ఎకనమిక్ టైమ్స్’ కథనం తెలిపింది. భారత్ లో జపాన్ రాయబారి రాసిన లేఖలోని ముఖ్యాంశాలతో ఈ పత్రిక ప్రముఖంగా ఓ స్టోరీని ప్రచురింది. హైకోర్టులో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలినా ఇఫ్పుడు సర్కారు ఏపీఈఆర్ సీ ద్వారానే ఒఫ్పందాల సమీక్షకు ముందుకెళ్ళే ఆలోచనలో ఉంది.