Telugu Gateway
Andhra Pradesh

మోడీ ముందు భారీ లిస్ట్ పెట్టిన జగన్

మోడీ ముందు భారీ లిస్ట్ పెట్టిన జగన్
X

ఓ వైపు లోక్ సభలో అత్యంత కీలకమైన కాశ్మీర్ విభజన బిల్లు. చర్చ అంతా హాట్ హాట్ గా సాగుతోంది. ఈ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోడీ దాదాపు నలభై అయిదు నిమిషాలకు పైగా సమయం కేటాయించటం అంటే విశేషమే. మామూలు రోజుల్లో ప్రధానితో ఓ ముఖ్యమంత్రి భేటీ కావటం అత్యంత సాదా సీదా విషయం. కానీ మంగళవారం నాడు ఢిల్లీలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నం. అయితే ప్రధాని మోడీ, సీఎం జగన్ ల భేటీ పూర్తి అయింది. ఈ భేటీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని ముందు పెద్ద జాబితానే పెట్టారు. మరి వీటిలో ఎన్నింటికి మోక్షం లభిస్తుంది అన్నతి కొంత కాలం పోతే కానీ తెలియదు. ఏపీకి ఏమి కావాలో కోరటంతో పాటు..గత చంద్రబాబు పాలనకు సంబంధించిన అక్రమాలు..అవినీతి వ్యవహరాలను కూడా మోడీకి నివేదించారు. మోడీకి సమర్పించిన వినతిపత్రంలో జగన్మోహన్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. వాటిలో ముఖ్యాంశాలు..‘రాష్ట్ర విభజన కారణంగా ఆదాయాలకు గండిపడింది. 2014–15 నాటికి రూ. 97వేల కోట్లు ఉన్న అప్పులు 2018–19 నాటికి రూ. 2.58 లక్షల కోట్లకు చేరాయి. వెనుకబడిన 7 జిల్లాలకు ఆరేళ్ల కాలానికి యాభై కోట్ల చొప్పున ఇప్పటికి రూ. 2100 కోట్లు అందాల్సి ఉండగా, రూ.1050 కోట్లు మాత్రమే విడుదలచేశారు.

వెనుకబడిన జిల్లాల అభివృద్ధికోసం కేబీకే తరహాలో మిగిలిన రూ.23,300 కోట్ల నిధులు ఇవ్వండి. పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్రలో చెరువుల అనుసంధానం కార్యక్రమానికి సాయం చేయండి. గోదావరి, కృష్ణా అనుసంధానం ద్వారా కృష్ణా డెల్టాకే కాకుండా కరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి జలాలు అందించి తాగునీరు, సాగునీటి కొరతను నివారించడానికి పూనుకున్నాం. కేంద్రం ఈ ప్రాజెక్టుకు సాయం చేయాలి. కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గిపోయింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గోదావరిలో వరదజలాలను తరలించాల్సిన ఆవశ్యకత నెలకొంది. గోదావరి–కృష్ణా అనుసంధానానికి ఆర్ధికంగా సహకరించాలి. ఇంటింటికీ రక్షిత తాగునీటి కల్పించడానికి వాటర్‌ గ్రిడ్‌ను తీసుకొస్తున్నాం. 2050 వరకూ ప్రజల అవసరాలను తీర్చిదిద్దేలా గ్రిడ్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దాదాపు రూ.60వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. దీనికి తగురీతిలో సాయమందించండి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించారు. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరం. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రాయితీలు ఇవ్వండి. పదేళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు ఇవ్వండి. పదేళ్ల పాటు ఇన్‌కంట్యాక్స్‌ మినహాయింపులు ఇవ్వండి.10 ఏళ్లపాటు 100శాతం ఇన్సూరెన్స్‌ ప్రీమియం రియంబర్స్‌మెంట్‌ ఇవ్వండి. రెవెన్యూ లోటు కింద రూ.22,948 కోట్లను పూడ్చాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టుకోసం గతంలో ఖర్చుచేసిన రూ. 5,103 కోట్లను రీయంబర్స్‌ చేయాలి.

ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, పునరావాసం కోసం రూ.16వేల కోట్లు మంజూరు చేయండి. కడప స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామంటూ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చారు. ఇది ఈ ప్రాంతానికి చాలా అవసరం. ఇనుప గనులు, నీటి వసతి లభ్యత ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేశాం. దీనికి పోర్టు, రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావాలి. దుగ్గరాజపట్నం వద్ద పోర్టును ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చారు. దుగ్గరాజ పట్నం పోర్టు ఏర్పాటు సాధ్యంకాదని, ప్రత్యామ్నాయ స్థలం చూడాలంటూ నీతి ఆయోగ్‌ చెప్పింది. దీనికి బదులుగా రామాయపట్నం వద్ద పోర్టును నిర్మించండి. రాజధాని నిర్మాణంకోసం రూ. 2500 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికి రూ.1500 కోట్లు ఇచ్చారు. రాజధాని నిర్మాణం పేరుతో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నాం. విచారణ పూర్తయ్యాక శాస్త్రీయ దృక్పథంతో రాజధాని నిర్మాణానికి కావాల్సినవి కోరుతాం’ అని పేర్కొన్నారు.

Next Story
Share it