Telugu Gateway
Andhra Pradesh

బిగ్ బ్రేకింగ్...నవయుగా బ్యాంకు గ్యారంటీల జప్తు!

బిగ్ బ్రేకింగ్...నవయుగా బ్యాంకు గ్యారంటీల జప్తు!
X

వైఎస్ జగన్ సర్కారు దూకుడు చూసి కొంత మంది అధికారులు కూడా షాక్ కు గురవుతున్నారు. తాజాగా ఏపీ జెన్ కో పోలవరం విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి నవయుగా సంస్థకు చెందిన బ్యాంకు గ్యారంటీల జప్తు చేయాల్సిందిగా బ్యాంకులను కోరింది. ఈ మేరకు లేఖలు అందజేశారు. అయితే వందల కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీల జప్తు విషయంలోనూ సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తోందని చెబుతున్నారు. కనీసం నవయుగా సంస్థకు నోటీసు కూడా ఇవ్వకుండానే బ్యాంకు గ్యారంటీల జప్తుకు దిగటం అధికారులను కూడా నివ్వెరపరుస్తోంది. అయితే బ్యాంకులు దీనికి కొంత సమయం కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విషయం తెలుసుకున్న నవయుగా కంపెనీ కూడా బ్యాంకు గ్యారంటీల జప్తును అడ్డుకోవాలంటూ కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. నవయుగా స్టే తెచ్చుకోవటం కనుక నిజం అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు ప్రమాదంలో పడినట్లే అవుతుంది.

ఈ వివాదం తేలే వరకూ కొత్తగా పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగటం అనుమానమే. అదే కనుక జరిగితే ప్రాజెక్టు టెండర్లు పిలవటానికి కూడా ఛాన్స్ ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే జెన్ కోతో కుదుర్చుకున్న ఒఫ్పందం ప్రకారం నవయుగా సంస్థను విద్యుత్ ప్రాజెక్టు నుంచి తప్పించటం కూడా సాధ్యంకాదని..అందులో నిబంధనల ఉల్లంఘన ఏమీ జరగలేదని అధికారులు నివేదిక సిద్ధం చేశారు. అయినా సరే జగన్ సర్కారు మాత్రం నవయుగాను తప్పించాల్సిందే అని పట్టుబడుతోంది. సర్కారు ఒత్తిడితో అధికారులు కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ముందుకెళుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ వ్యవహారాలు మొత్తం అత్యంత సంక్లిష్టం అయి కూర్చుంటాయని..అటు కాంట్రాక్టర్లు..ఇటు కంపెనీలు ఏపీ వైపు చూడాలంటే భయపడే పరిస్థితి తెచ్చుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

బ్యాంకు గ్యారంటీల జప్తు జరిగి..దీనిపై నవయుగా కోర్టును ఆశ్రయిస్తే అది పోలవరంపై ప్రభావం చూపిస్తుందని విద్యుత్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పుపట్టరు. అయితే ఆయా ప్రాజెక్టులపై ఇప్పటికే కంపెనీలు కోట్లాది రూపాయలు వ్యయం చేసి ఉంటాయి. కానీ సడన్ గా అన్నీ రద్దు అంటే కంపెనీ చేసిన వ్యయాన్ని ఎవరు భరిస్తారు?. కోట్లాది రూపాయల నష్టాన్ని భరించటానికి ప్రైవేట్ కంపెనీలు ఎందుకు సిద్ధపడతాయి?. అలాంటప్పుడు న్యాయపోరాటం మొదలైంది. ఇక అంతే. అది ఎప్పటికి ముగుస్తుందో..ఏమి అవుతుందో ఎవరికీ తెలియదు.

Next Story
Share it