Telugu Gateway
Andhra Pradesh

అమెరికా టూర్ లో జగన్

అమెరికా టూర్ లో జగన్
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్ళారు. జగన్ తన కుటుంబంతో కలసి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాత్రి 7.40కు చేరుకున్నారు. రాత్రి 9.50 నిమిషాలకు వాషింగ్టన్‌కు బయలుదేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎం కార్యాలయం గురువారం రాత్రి వెల్లడించింది. ఆగస్టు 16, ఉదయం 8:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు) వాషింగ్టన్‌ డీసీకి చేరతారు. అదేరోజు అమెరికా రాయబారితో, అమెరికా– ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం అమెరికాలో భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు.

ఆగస్టు 17 మధ్యాహ్నం 2 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు) డల్లాస్‌ చేరుకుంటారు. అక్కడి కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) నార్త్‌ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగిస్తారు. ఆగస్టు 18న వాషింగ్టన్‌ డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. ఆగస్టు 19, 20, 21 తేదీల్లో వ్యక్తిగత పనుల్లో ఉంటారు. ఆగస్టు 22న మధ్యాహ్నం షికాగోలో మరికొందరు ప్రతినిధులను కలుస్తారు. అదే రోజు రాత్రి 8:30 గంటలకు రాష్ట్రానికి బయల్దేరతారని తెలిపారు.

Next Story
Share it