Telugu Gateway
Andhra Pradesh

విజయసాయిరెడ్డికి దక్కిన ‘ప్రత్యేక హోదా’

విజయసాయిరెడ్డికి దక్కిన ‘ప్రత్యేక హోదా’
X

ఆంధ్రప్రదేశ్ కు ‘ప్రత్యేక హోదా’ దక్కుతుందో లేదో ఎవరికీ తెలియదు కానీ...వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి మాత్రం ‘ప్రత్యక ప్రతినిధి’ హోదా దక్కింది. తొలుత కేబినెట్ ర్యాంకుతో ఆయనకు ఈ హోదా అప్పగిస్తూ సర్కారు జీవో జారీ చేసి నాలుక కరుచుకుంది. ఈ విషయంలో సాక్ష్యాత్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు సీఎంవో ఘోరంగా విఫలమైందని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అసలు జీవో జారీ చేస్తున్నప్పుడు దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో ఏ మాత్రం ఆలోచించకుండా అనాలోచితంగా విజయసాయిరెడ్డికి ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి అంటూ జీవో జారీ చేశారు. చివరకు ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వస్తుందని మేల్కొని తీరిగ్గా పాత జీవోను రద్దు చేశారు. దీని కోసం ఏకంగా చట్టాన్ని కూడా సవరించారు. ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తెచ్చారు.

విజయసాయిరెడ్డికి ఇప్పటికే అత్యంత కీలకమైన పార్లమెంటరీ పార్టీ నేత పదవి ఉన్నా కూడా ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి పదవిపై ఆయన ఎందుకంత ఫోకస్ పెట్టారన్నది వైసీపీ వర్గాల్లోనే పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనికి సాక్షి పత్రిక వింత భాష్యం చెప్పింది. విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా సేవా భావంతో ప్రత్యేక ప్రతినిధిగా ఎంపిక చేశారట. సడన్ గా ఈ సేవా భావం ఎందుకు పుట్టుకొచ్చింది. నిజంగా సేవా భావమే అయితే..మిగిలిన పోస్టులకు కూడా దీన్ని వర్తింపచేయవచ్చు కదా?. అంటే అదేమీ ఉండదు. విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ సర్కారు ఆదివారం నాడే జీవో జారీ చేసింది. ఈ సారి మాత్రం ఎలాంటి జీతభత్యాలు లేకుండా అంటూ జీవోలో పేర్కొన్నారు. ఈ మేరకు జీవో ఎంఎస్ 75 జారీ చేశారు.

Next Story
Share it