Telugu Gateway
Politics

జైపాల్ రెడ్డి అస్తమయం

జైపాల్ రెడ్డి అస్తమయం
X

ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత, దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రవేసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్ రెడ్డి ఇక లేరు. ఆయన ఆదివారం ఉదయం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 77 సంవత్సరాలు. కొద్దిరోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ పరమపదించారు. ఆయన భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్‌ లోని స్వగృహానికి తరలించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మాడుగులలో 1942 జనవరి 16న జైపాల్‌రెడ్డి జన్మించారు. ఉస్మానియా వర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందిన జైపాల్‌రెడ్డి.. 1969లో తొలిసారి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నాలుగుసార్లు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 1984లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జూన్‌ 1991 నుంచి 1992 వరకు రాజ్యసభాపక్ష నేతగా వ్యవహరించారు.

1999 నుంచి 2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి గుర్తింపు పొందారు.ఐకే గుజ్రాల్‌, మన్మోహన్‌సింగ్‌ కేబినెట్‌లో జైపాల్‌రెడ్డి మంత్రిగా పనిచేశారు. గుజ్రాల్‌ హయాంలో కేంద్ర సమాచారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మన్మోహన్‌సింగ్‌ హయాంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇదిలాఉండగా.. జైపాల్‌రెడ్డి భౌతిక కాయానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాళుర్పించి, ఆయన కుంటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తొలుత కరడుగట్టిన సమైక్యవాదిగా పేరుగాంచిన జైపాల్ రెడ్డి తర్వాత ప్రత్యేక తెలంగాణ వాదానికి మద్దతు ఇఛ్చారు. తెలంగాణ బిల్లు తయారీలో ఆయన కూడా కీలక పాత్ర పోషించారు.

Next Story
Share it