Telugu Gateway
Politics

కర్ణాటక కూడా బిజెపి పరంగా కానుందా?!

కర్ణాటక కూడా బిజెపి పరంగా కానుందా?!
X

కర్ణాటకలో మళ్ళీ ఆపరేషన్ కమలం ప్రారంభం అయినట్లే కన్పిస్తోంది. అక్కడ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయటంతో వ్యవహారం ఒక్కసారిగా మారిపోయింది. లోక్ సభ ఎన్నికలు పూర్తయి..కేంద్రంలోమళ్ళీ బిజెపి గతం కంటే మరింత బలోపేతం కావటంతో ఆ పార్టీలో దూకుడు మరింత పెరిగింది. అతి తక్కువ తేడాతో కాంగ్రెస్, జెడీఎస్ సంకీర్ణ సర్కారు నడుస్తుండటంతో ఎలాగైనా దాన్ని పడగొట్టి కర్ణాకట పగ్గాలు దక్కించుకుని దక్షిణాదిలో మరోసారి పాగా వేయాలన్నది ఆ పార్టీ వ్యూహాంగా కన్పిస్తోంది. అయితే ఆ పని పూర్తి కావటానికి కూడా ఎంతో దూరం లేదనే సంకేతాలు కన్పిస్తున్నాయి ఇప్పుడున్న దాని ప్రకారం అది కొద్ది మందిని తమ వైపు తిప్పుకోవటం లేదా...రాజీనామా చేయించి గెలిపించుకోవటం వంటి చర్యల ద్వారా కర్ణాటకలో కాలు పెట్టాలని బిజెపి చూస్తోంది. ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి కుమారస్వామి తమ సర్కారును బిజెపి అస్థిరపర్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి అమెరికాలో ఉన్న సమయంలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయటం అంతా వ్యూహం ప్రకారం సాగుతుందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కర్ణాటక పరిణామాల్లో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే.

కర్నాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆనంద్‌ సింగ్‌ (విజయనగర), రమేశ్‌ జార్కిహోళి (గోకాక్‌)లు తమ పదవులకు, పార్టీకి సోమవారం రాజీనామా సమర్పించారు. కర్ణాటక స్పీకర్‌ రమేశ్‌ ఇంటికి వెళ్లిన ఆనంద్‌ సింగ్‌ రాజీనామా సమర్పించగా, రమేశ్‌ జార్కిహోళి ఫ్యాక్స్‌ ద్వారా రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆనంద్‌ సింగ్‌ గవర్నర్‌ వజూభాయ్‌వాలాకు కూడా రాజీనామాను అందజేశారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్‌ నేతలు మాజీ సీఎం సిద్దరామయ్య ఇంట్లో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆనంద్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘నిజమే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించాను. విజయనగర జిల్లాను ఏర్పాటుచేయడం, జేఎస్‌డబ్ల్యూ కంపెనీకి బళ్లారి జిల్లాలో 3,667 ఎకరాలు అమ్మేందుకు ఇచ్చిన అనుమతుల్ని రద్దుచేయాలన్న నా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేదు. ఒకవేళ ఈ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తే, నా రాజీనామాపై పునరాలోచిస్తా’ అని స్పష్టం చేశారు.

అయితే తనపై రిసార్టులో దాడిచేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జె.ఎన్‌.గణేశ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో ఆనంద్‌సింగ్‌ రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహితవర్గాలు చెప్పాయి. మరో తిరుగుబాటు ఎమ్మెల్యే రమేశ్‌ జార్కి హోళి స్పందిస్తూ..‘ మంగళవారం అమావాస్య కాబట్టి ఈరోజు(సోమవారం) నా రాజీనామాను స్పీకర్‌కు ఫ్యాక్స్‌ ద్వారా పంపాను. రేపు ఉదయం వ్యక్తిగతంగా కలిసి రాజీనామా సమర్పిస్తాను’ అని చెప్పారు. మరికొంత మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి రాజీనామా చేయబోతున్నారా? అన్న మీడియా ప్రశ్నకు.. ‘మీకు ప్లాన్‌ మొత్తం చెప్పేస్తే ఎలా? వేచిచూడండి’ అని జవాబిచ్చారు. ఆనంద్‌ సింగ్‌ రాజీనామా లేఖ తమకు అందిందనీ, నిబంధనల మేరకు ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ కార్యాలయం తెలిపింది.

Next Story
Share it