Telugu Gateway
Politics

ముంబయ్ హోటల్ లో మాజీ మంత్రికి నో ఎంట్రీ

ముంబయ్ హోటల్ లో మాజీ మంత్రికి నో ఎంట్రీ
X

కర్ణాటక రాజకీయాలు అలా హాట్ హాట్ గా కొనసాగుతూనే ఉన్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబయ్ లోని ఓ హోటల్ లో పాగా వేయగా..అక్కడకు మాజీ మంత్రి, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన డీ కె శివకుమార్ చేరుకున్నారు. అయితే ఆయన్ను హోటల్ లోకి పోకుండా పోలీసులు అడ్డుకున్నారు. తాను హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్నానని..తన మిత్రులతో సమావేశం అయ్యేందుకు వచ్చానని చెప్పినా పోలీసులు నో చెప్పారు. దీంతో హోటల్ బయటే శివకుమార్ వేచిచూడాల్చి వచ్చింది. ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే తమకు ప్రాణహాని ఉందని రెబల్ ఎమ్మెల్యేలు ముంబయ్ పోలీసు కమిషనర్ కు లేఖ రాయటం..హోటల్ వెలుపల భారీ బందోబస్తు ఏర్పాటు చేయటం విశేషం. ముంబయ్ హోటల్ వెలుపల శివకుమార్ కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రెబల్స్‌ లో కొంతమంది ఎమ్మెల్యేలు చర్చలకు రమ్మంటేనే తాను వచ్చానని అన్నారు. భద్రత పేరుతో తమను అడ్డుకుంటున్నారంటూ శివకుమార్‌ ఆరోపించారు. స్నేహితులను కలిసేందుకే ముంబై వచ్చానని, ఎమ్మెల్యేలను కలవకుండా వెనక్కి వెళ్లేది లేదని ఆయన స్పష్టం చేశారు.

శివకుమార్‌తో పాటు జేడీఎస్‌ ఎమ్మెల్యే శివలింగగౌడ కూడా ముంబై వచ్చారు. సంకీర్ణ ప్రభుత్వంపై అసమ్మతితో ఇప్పటికే రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ముంబై స్టార్‌ హోటల్‌లో మకాం వేసిన విషయం తెలిసిందే. స్పీకర్‌ తమ రాజీనామాలు అంగీకరించిన అనంతరమే తాము బెంగళూరు వస్తామని అసమ్మతి ఎమ్మెల్యేలు తెలిపారు. ఒకవేళ ఆమోదం పొందకుండా చేస్తే తాము ఇక్కడి నుంచి గోవా, లేదా పుణె వెళ్లడానికి నిర్ణయించుకున్నామని అసమ్మతి ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అసమ్మతి ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్లినా వారికి బీజేపీ నాయకులు సకల సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Next Story
Share it