Telugu Gateway
Andhra Pradesh

జరగని అవినీతి పేరుతో ఏపీకి అన్యాయం చేస్తారా?

జరగని అవినీతి పేరుతో ఏపీకి అన్యాయం చేస్తారా?
X

తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు వైసీపీ సర్కారు గత టీడీపీ హయాం అంతా అక్రమాల మయమే అని ఆరోపిస్తుంటే..చంద్రబాబు మాత్రం ముందు నుంచే దీనికి కౌంటర్ ఎటాక్ ప్రారంభించినట్లు కన్పిస్తోంది. మరికొద్ది రోజుల్లో నిపుణుల కమిటీ, మంత్రుల కమిటీ నివేదికలు రానున్న తరుణంలో చంద్రబాబు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. అసలు జరగని అవినీతి పేరు చెప్పి రాష్ట్రానికి అన్యాయం చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన వారిలో 90 శాతం మంది సంతృప్తిగానే ఉన్నారని తెలిపారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేయకుండా వెనక్కిపోవటానికి ముమ్మాటికే వైసీపీనే కారణం అని చంద్రబాబు ఆరోపించారు. ఓ వైపు ప్రపంచ బ్యాంక్ కేంద్రం లేఖ వల్లే తాము వెనక్కి తగ్గామని అధికారికంగా ప్రకటించినా కూడా చంద్రబాబు మాత్రమే వైసీపీనే కారణం అంటూ ప్రకటించటం విశేషం.

మొదటి నుంచి అమరావతిని వైసీపీ వ్యతిరేకిస్తోందని..రాజధాని రావటం వల్లే ఇక్కడ రైతుల భూముల ధరలకు విలువ వచ్చిందని..వారంతా ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. రాజధాని శంకుస్థాపనకు పిలిచినా జగన్ రాలేదని, తాము ఎంతో కష్టపడినందునే ఇఫ్పుడు రాజధానిలో చాలా భవనాలు పూర్తయ్యాయని తెలిపారు. అసెంబ్లీ సమావేశం అనంతరం చంద్రబాబు మంగళగిరిలో మీడియాతో మాట్లాడూతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పుడు డాక్యుమెంట్లు చూపెట్టి.. ప్రజలను మభ్యపెట్టి, వైసీపీ నేతలు టీడీపీని టార్గెట్ చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నీ వాళ్లే రాసుకుని సభలో చదువుతున్నారని విమర్శించారు. ‘రాజశేఖర్ రెడ్డి చెబితే కియా వచ్చింది.. అది మేము నమ్మాలి’.. అంతేకదా.. మే నెలలో వరల్డ్ బ్యాంక్ మంజూరు చేసిన లోన్ కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వచ్చిందని వాళ్లు చెబితే మేము నమ్మాలా? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పలేదని, ఇదేనా విశ్వాసనీయత అని ఆయన ప్రశ్నించారు. తప్పులు చెప్పి, టీడీపీపై బుదర జల్లి, తప్పించుకుని తిరగాలంటే కుదరదన్నారు. వైసీపీ ప్రభుత్వ చర్యల వల్ల అమరావతికి నష్టం జరిగి..హైదరాబాద్ కు మేలు జరిగే పరిస్థితి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Next Story
Share it