సమస్యలు టీడీపీపై తోసి తప్పించుకుంటారా!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సమస్యలు అన్నీ టీడీపీపై తోసేసి తప్పించుకోవటం సరికాదన్నారు. ఏ సమస్య వచ్చినా తెలుగుదేశంపై తోసి తప్పుకోవాలని సీఎం జగన్ చూడటాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మీ చేతకాని తనం కప్పెట్టడానికే ఇటు సమస్యలు పరిష్కరించకుండా, అటు దాడులు, దౌర్జన్యాలు కొనసాగిస్తూ రాష్ర్టంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. కార్యకర్తలకు అన్నివేళలా, అన్నివిధాలా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తెలుగుదేశంపై పార్టీ కార్యకర్తలు, నేతలపై దాడులు రోజురోజుకు ఉధృతం కావడం పట్ల నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు గుంటూరు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పామని తెలిపారు. వైకాపా వర్గీయులు చేసే దాడులు, బెదిరింపులకు సంబంధించిన సమాచారాన్ని, టీడీపీ ప్రత్యేక విభాగం నెంబర్ 7306299999కి ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.
పార్టీపరంగా కార్యకర్తలకు, నాయకులకు అన్నివిధాలా సహాయం అందిస్తామన్నారు. 40రోజుల్లో వంద చోట్ల పైగా దాడులు,దౌర్జన్యాలు చేయడం గర్హనీయం. ఆరుగురిని అత్యంత దారుణంగా చంపేయడం కిరాతకం. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకే ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని లోకేష్ తెలిపారు. వారెంత కవ్వింపు చర్యలకు దిగినా టిడిపి కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారంటూ అధికారం అండతో వైకాపా వర్గీయులు రెచ్చిపోవడాన్ని ఖండించారు. రాష్ట్రంలో ఎక్కడ దాడులు జరిగినా, దౌర్జన్యాలకు పాల్పడినా తక్షణమే పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకవిభాగం నెంబర్ 7306299999కి ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. చట్టపరమైన, న్యాయపరమైన సహాయం ఆయా కుటుంబాలకు పార్టీ తరఫున అందజేస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధిపై దృష్టిసారించాలని, పేదల సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని సూచించారు