Telugu Gateway
Andhra Pradesh

కెసీఆర్ చాలా మంచోడు

కెసీఆర్ చాలా మంచోడు
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన ఇది. గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించిన అంశంపై చర్చ సంరద్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యత అవసరమని వ్యాఖ్యానించారు. తెలుగు వాళ్లమంతా ఒకటిగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగానే కేసీఆర్‌ మంచి వాడు అంటూ జగన్ కితాబిచ్చారు. కేసీఆర్‌ సహకారంపై హర్షించాల్సిందిపోయి దాన్ని కూడా వక్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. అదే సమయంలో గోదావరి నది జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తెలంగాణ భూ భాగం నుంచి తరలించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అది మనకు ఉపయోగం అనుకుంటేనే ముందుకు వెళతామని,లేకుంటే వెళ్లమని అన్నారు.తెలంగాణ భూ భాగం నుంచి నీటిని తరలించినా, దానిని మద్యలో వాడే అవకాశం లేకుండా ఎలా చేయాలన్నదానిపై కూడా చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు. శ్రీశైలం, సాగర్ రెండు ప్రాజెక్టులు రెండు రాస్ట్రాల ఉమ్మడి ఆస్తి అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టులకు ఇప్పుడు నీరు రాని పరిస్థితిలో అన్ని జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలన్నది తమ ఉద్దేశమని ఆయన అన్నారు.తాను చెబుతున్న విషయాలు ప్రజలకు తెలియకుండా చేయడానికి సభలో టిడిపి ఎమ్మెల్యేలు గొడవ చేస్తున్నారని ఆయన అన్నారు. కేవలం 12 శాతం గోదావరి నీళ్లు మాత్రమే ఏపీలోకి వస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.

గోదావరి జలాల వినియోగంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా జగన్ మాట్లాడారు. కేవలం ఐదు టీఎంసీలు మాత్రమే మన ఆధీనంలో ఉంటాయని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించి పూర్తి చేశారన్నారు. ప్రాజెక్ట్ కడుతుంటే ఇక్కడ చంద్రబాబు ఉండి ఏం చేయగలిగారని ప్రశ్నించారు. మనది దిగువ రాష్ట్రం.. ఎగువ రాష్ట్రం వదిలితేనే మనకు నీళ్లు వస్తాయని చెప్పారు. ఇప్పటికే కృష్ణా జలాల విషయంలో ఏం జరుగుతోందో చూస్తూనే ఉన్నామని తెలిపారు. గుట్టల మధ్య డ్యాములు కట్టే కాలం పోయిందన్నారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ బ్యారేజీలు కడుతున్నారని వివరించారు. కాళేశ్వరం దిగువన 17 బ్యారేజీలు కట్టారని వెల్లడించారు. ఐదేళ్ల తర్వాత మన పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా లాభం లేదని విమర్శించారు.

కరవుతో జిల్లాలు అల్లాడుతుంటే.. రాజకీయాలే కావాలి అన్నట్లుగా టీడీపీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తన చూస్తుంటే.. మనుషులు అనలా..రాక్షసులు అనలా అర్ధంకావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మాత్రం ప్రతిపక్షం సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. గోదావరి జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణతో కలసి వెళ్లాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉన్న ఒప్పందాలే అమలు కావటంలేదని..అలాంటిది ఇప్పుడు కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల విషయం ఆషామాషీగా వెళితే ఏపీ తీవ్రంగా నష్టపోతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Next Story
Share it