Telugu Gateway
Politics

‘కర్ణాటకం’ క్లియర్

‘కర్ణాటకం’ క్లియర్
X

కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి తొలగటానికి రంగం సిద్ధం అయింది. గురువారం నాడు జరిగే విశ్వాస పరీక్షతో ఈ అంశం అటో..ఇటో తేలిపోనుంది. బుధవారం నాడు సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల రాజీనామాలకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. రెబెల్ ఎమ్మెల్యేలు విశ్వాస పరీక్షకు వెళ్ళాలా..వద్దా? అన్నది వారిష్టం అని స్పష్టం చేసింది. బలవంతంగా సభకు రావాలని కోరే హక్కు ఎవరికీ ఉండదని పేర్కొంది. అదే సమయంలో రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సింది కూడా స్పీకరే అని తేల్చిచెప్పింది. గత కొన్ని రోజులుగా కర్ణాటక రాజకీయం పలు మలుపులు తిరగుతున్న విషయం తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఎలాగైనా కర్ణాటకలో కూడా అధికారం దక్కించుకునేందుకు పావులు కదుపుతూ వస్తోంది. అందులో భాగంగానే ఎంపిక చేసిన ఎమ్మెల్యేలతో తమ పదవులకు రాజీనామా చేయించారు.

అంతే కాదు..రెబెల్ ఎమ్మెల్యేలను ముంబయ్ లోని ఓ హోటల్ లో పెట్టి ఉంచారు. తాము రాజీనామాలు చేసినా వాటిని స్పీకర్ ఆమోదించటం లేదంటూ రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు గడప తొక్కిన విషయం తెలిసిందే. రెబెల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు, మంత్రులు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇచ్చినట్లు లేవు. దీంతో కాంగ్రెస్, జెడీఎస్ సంకీర్ణ సర్కారు భవిష్యత్ గురువారం నాడు తేలనుంది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఈ సంకీర్ణ సర్కారు సంక్షోభంలో పడినట్లే కన్పిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎన్ని పరిణామాలు జరుగుతాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it