Telugu Gateway
Politics

యడ్యూరప్ప పీఏపై కిడ్నాప్ ఆరోపణలు

యడ్యూరప్ప పీఏపై కిడ్నాప్ ఆరోపణలు
X

కర్ణాటకలో సంకీర్ణ సర్కారును బిజెపి ముప్పుతిప్పలు పెడుతోంది. పైకి మాత్రం తమకు ఏమీ సంబంధం లేదని చెబుతున్నా తెరవెనక నుంచి కథ అంతా ఆ పార్టీనే నడిపిస్తుందనే విమర్శలు విన్పిస్తున్నాయి. కర్ణాటకలో రాజకీయ పరిణామాలు చకచకా సాగుతున్నాయి. అటు కాంగ్రెస్, ఇటు జెడీఎస్ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేసి..కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. మరో వైపు తక్షణమే కుమారస్వామి తన పదవికి రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు గవర్నర్, స్పీకర్ నిర్ణయాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఇదిలా ఉంటే సోమవారం నాడు రాజీనామా చేసిన రాష్ట్ర మంత్రి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నగేష్‌ను యడ్యూరప్ప ఆదేశాల మేరకే ఆయన పీఏ హైజాక్‌ చేశారంటూ కాంగ్రెస్‌ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై మంత్రి డీకే శివకుమార్‌ మాట్లాడుతూ.. ‘ఇంతకుముందే నగేష్‌ నాకు కాల్‌ చేశారు. యడ్యూరప్ప పీఏ తనను హైజాక్‌ చేశాడని చెప్పారు. వెంటనే నేను విమానాశ్రయానికి వెళ్లాను. ఆ లోపే విమానం వెళ్లి పోయింది’ అన్నారు. ఇదంతా యడ్యూరప్ప దర్శకత్వంలోనే జరుగుతుందని శివకుమార్‌ ఆరోపించారు.

స్వతంత్ర అభ్యర్థి అయిన నగేష్‌ గత నెలలోనే జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజా సంక్షోభ పరిస్థితుల్లో నగేశ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయ్‌ వాలాను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నానని, ఒక వేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీని ఆహ్వానిస్తే ఆ పార్టీకి మద్దతిస్తానని గవర్నర్‌కు రాసిన లేఖలో నగేశ్ పేర్కొన్నారు. రాజీనామా చేసిన ఆయన ఇప్పటికే ముంబయి చేరుకుని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిశారు. విమానాశ్రయంలో నగేష్‌ విమానం వద్దకు నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. కిడ్నాప్ ఆరోపణలపై నగేష్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it