జగన్ ను దేవుడు అన్న జనసేన ఎమ్మెల్యే

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే.. కోరని కోర్కెలు కూడా దేవుడు వైఎస్ జగనన్న’ అని మత్య్సకారులు చెబుతున్నారని తెలిపారు. మత్స్యకారులను ఆదుకోవడానికి సీఎం వైఎస్ జగన్ నిధులు కేటాయించడం సంతోషమన్నారు. బడ్జెట్‌లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు. 108, 104లతో ప్రజల ఆరోగ్య భద్రత పెరిగింది. కానీ గత ప్రభుత్వం ఆ వాహనాలు తుప్పు పడుతున్న పట్టించుకోలేదు. ఈ బడ్జెట్ కేవలం 50 రోజుల్లో తయారు చేసింది కాదు.
పాదయాత్రలో అన్ని వర్గాల కష్టాలను చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ బడ్జెట్ రూపొందించార’ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట వేసిందని రాపాక వరప్రసాద్ అన్నారు. ఈ విషయంలో ఆయన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయాన్ని పండగలా చేశారని గుర్తుచేశారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ. 7లక్షల పరిహారం ఇవ్వడం గొప్ప విషయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే తమ బతుకులు బాగుపడతాయని రైతులు ఆశించారు. అలాంటి బడ్జెట్‌నే సీఎం వైఎస్ జగన్ రూపొందించారని వ్యాఖ్యానించారు.