Telugu Gateway
Andhra Pradesh

జగన్ యూటర్న్ లు స్టార్ట్ అయ్యాయా!?

జగన్ యూటర్న్ లు స్టార్ట్ అయ్యాయా!?
X

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా విచిత్ర వాదన చేశారు. ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐదేళ్ల పాటు గాడిదలు కాశారా? అని ప్రశ్నించారు. తాను వెళ్లినా..వెళ్ళకపోయినా కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసేవాళ్ళని జగన్ సభలో చెప్పారు. మరి చంద్రబాబు ఆపలేకపోయిన ప్రాజెక్టును జగన్ ‘ఆన్’ చేయటానికి వెళ్ళటం వెనక ఉద్దేశం ఏంటి?. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల గోదావరి ప్రవాహానికి బ్రేకులు పడతాయని..దీని వల్ల ఏపీలో సాగు, తాగునీటి సమస్యలు వస్తాయని ప్రతిపక్షంలో ఉండగా ‘జలదీక్ష’ సభలో జగన్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో సీఎం కెసీఆర్ పై తీవ్ర విమర్శలు కూడా చేశారు జగన్. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జగన్ అప్పుడు మాట్లాడింది తప్పా?. లేక ఇప్పుడు చేస్తున్న పని తప్పా?. రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే కరెక్ట్ గా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పుగా కన్పించింది..అధికారంలోకి రాగానే సక్రమం ఎలా అవుతుంది?. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సయోధ్యలో కొత్త సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం..వాటి సాధ్యాసాధ్యాలపై చర్చలు సాగుతున్నాయి.

మరి జగన్ సడన్ గా కాళేశ్వరంపై తన వైఖరిని ఎందుకు మార్చుకున్నారు. గతంలో చెప్పినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏపీకి ఎలాంటి నష్టం ఉండదని జగన్ ఇప్పుడు భావిస్తున్నారా?. జగన్ ప్రస్తుతం చెబుతున్న మాటలు చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జగన్ యూటర్న్ తీసుకున్నట్లే కన్పిస్తోంది. ఇంత కాలం చంద్రబాబుపై యూటర్న్ ముద్ర వేసిన వైసీపీ..అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టు విషయంలో యూటర్న్ తీసుకున్నట్లు అయింది. అంతే కాదు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సాక్ష్యాత్తూ అసెంబ్లీ వేదికగా తమ వైఖరులు (స్టాండ్స్) అప్పుడు అలా ఉందని..ఇప్పుడు ఇలా ఉందని..స్టాండ్స్ డైనమిక్ అంటూ వ్యాఖ్యానించి మరింత కలకలం రేపారు.

Next Story
Share it