Telugu Gateway
Andhra Pradesh

కడప స్టీల్ ప్లాంట్ పై జగన్ విస్పష్ట హామీ

కడప స్టీల్ ప్లాంట్ పై  జగన్ విస్పష్ట హామీ
X

కడప స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విస్పష్టమైన ప్రకటన చేశారు. డిసెంబర్ 26న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి..మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 20 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం నాడు జగన్ తొలిసారి జిల్లా పర్యటనగా కడపలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జూలై 8న వైఎస్ జయంతి కావటంతో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గత తెలుగుదేశం ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఎన్నో డ్రామాలు ఆడిందని అన్నారు. కడప జిల్లా ప్రజల కల అయిన ఉక్కు ఫ్యాక్టరీ హామీని అమలు చేస్తానని తెలిపారు. కులాలు..మతాలు..ప్రాంతాల వంటి చిల్లర అంశాల జోలికి వెళ్ళకుండా ప్రతి ఒక్కరికి మేలు చేయటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. దీని ప్రజలందరి దీవెనలు కావాలని కోరారు. కడప జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను కూడా సకాలంలో పూర్తి చేస్తామని జగన్ తెలిపారు. సాగునీటి కోసం కుందూ నదిపై జలదరాశి ప్రాజెక్టు నిర్మించనున్నట్లు తెలిపారు. దీనికి కూడా డిసెంబర్ 26నే శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.

రైతులందరికీ సున్నా వడ్డీకే రుణాలందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల హామీలో పేర్కొన్నట్లు రైతులకు ఉచితంగా పగటిపూట 9 గంటల కరెంట్‌ ఇస్తామని వెల్లడించారు. రైతుల బాధల్ని గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని జగన్ విమర్శించారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఉద్ఘాటించారు. ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్‌ సరఫరా చేస్తామని చెప్పారు. వైఎస్సార్‌ పంటలబీమా పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఖరీఫ్, రబీలలో సాగు చేసే 27 రకాల పంటలకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటాను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.

ప్రతి నియోజకవర్గంలో కోల్డ్‌ స్టోరేజ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, వ్యవసాయ ల్యాబోరేటరీలు ఏర్పాటు చేసి.. రైతులకు నాణ్యమైన పురుగు మందులు, ఎరువు, విత్తనాలు ఇస్తామని వెల్లడించారు. వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు చేసి ప్రతినెలా రైతు సమస్యలపై సమీక్ష చేస్తున్నామని తెలిపారు. ప్రతి రైతన్నకు ఎలా తోడుగా ఉండాలనేది ఆలోచిస్తున్నామన్నారు. పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రమాదవశాత్తు రైతు మరణించినా.. ఆత్మహత్య చేసుకున్నా ఆ కుటుంబానికి రూ. 7లక్షల చెక్‌ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇవన్నీ అధికారంలోకి వచ్చిన నెలలోపే చేశామన్నారు.

Next Story
Share it