Telugu Gateway
Telangana

చారిత్రక జాబితా నుంచి ఎర్రమంజిల్ ను ఎలా తొలగించారు?

చారిత్రక జాబితా నుంచి ఎర్రమంజిల్ ను  ఎలా తొలగించారు?
X

తెలంగాణలో కొత్త అసెంబ్లీ, సచివాలయం నిర్మాణ వ్యవహారం కోర్టుల్లో నడుస్తూనే ఉంది. ప్రభుత్వం అయినా నిబంధనలు పాటించాల్సిందేనని..ఎవరూ చట్టానికి అతీతులు కారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక సారి చారిత్రక జాబితాలోకి వచ్చిన కట్టడాలను ప్రభుత్వం అందులో నుంచి తప్పించి..ఏ నిబంధనల ప్రకారం కూల్చాలని నిర్ణయించిందని హైకోర్టు ప్రశ్నించింది. చారిత్రక ప్రాంతాలను రక్షించాలని నిబంధనలు చెబుతున్నాయి కదా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ నిర్మాణం కోసం అక్కడున్న పురాతన భవనాలను కూల్చివేసే అంశంపై గతంలో పలువురు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఎర్రమంజిల్‌లో ప్రస్తుతం ఉన్న భవనాలు చారిత్రక కట్టడాలని, నిజాం వారసులు నిర్మించిన పురాతన కట్టడాలను కూల్చివేయడానికి వీల్లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. అవసరం లేకపోయినా కొత్తగా అసెంబ్లీ భవనాలను నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని, దీంతో ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు.

ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనం అవసరాలకు సరిపోవడం లేదని, భదత్రాపరంగానూ అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే నిపుణుల సూచనలతో నూతన భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని ఆయన పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే నూతన అసెంబ్లీ నిర్మాణం చేపడతామని చెప్పారు. ఎర్రమంజిల్‌లో ఉన్న భవనాలు చారిత్రక కట్టడాలు కావని.. చారిత్రక జాబితా నుంచి ప్రభుత్వం వాటిని తొలగించిందని అదనపు ఏజీ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Next Story
Share it