Telugu Gateway
Andhra Pradesh

తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్

తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్
X

ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి వరస పెట్టి షాక్ లు తగులుతున్నాయి. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తాను బిజెపిలో చేరబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఆ పార్టీ పెద్దలతో మాట్లాడి ఎప్పుడు చేరేది నిర్ణయించుకుంటానన్నారు. దీంతో ఆయన టీడీపీని వీడటం ఖాయం అయిపోయింది. పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి లోగుట్లు ఎన్నో రాయపాటి సాంబశివరావుకు తెలుసు. ఎందుకంటే ఆయనకు చెందిన ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీకే ఈ ప్రాజెక్టు దక్కిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం రాయపాటి నివాసానికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ వెళ్లి చర్చలు జరిపారు. ఆ తర్వాత రాయపాటి సాంబశివరావు కూడా టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు. బిజెపిలో చేరుతున్న విషయాన్ని ఆయన చంద్రబాబుకు కూడా స్పష్టం చేసినట్లు ప్రచారం జరిగింది.

వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఆ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా బలమైన కేడర్‌ ఉన్న రాయపాటిని చేర్చుకోవడం ద్వారా పార్టీని పటిష్ఠం చేయాలని భావిస్తున్నారు. రాంమాధవ్‌ కూడా నేరుగా తమ పార్టీలో చేరాల్సిందిగా రాయపాటిని కోరినట్లు తెలిసింది. ఇద్దరి నడుమ సానుకూల చర్చలే జరిగినట్లు చెబుతున్నారు. రాయపాటితో పాటు రాబోయే రోజుల్లో మరింత మంది కీలక నేతలు టీడీపీని వీడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వాదన మరోలా ఉంది. ఎంత మంది నేతలు చేరినా ఏపీలో బిజెపి చేయగలిగింది ఏమీ ఉండదని చంద్రబాబు వాదిస్తున్నారు. కొత్త నేతలను తయారు చేసుకుంటే సరిపోతుందని..నేతల వలసలు పెద్దగా ప్రభావం చూపించబోవని ఎంపీలతో భేటీ వ్యాఖ్యానించారు.

Next Story
Share it