‘డియర్ కామ్రెడ్’ మూవీ రివ్యూ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన. ఈ కాంబినేషన్ సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. దీనికి కారణం వీరిద్దరూ కలసి నటించిన ‘గీత గోవిందం’ సినిమా సూపర్ హిట్ కావటమే. మళ్ళీ అదే కాంబినేషన్ ‘డియర్ కామ్రెడ్’తో రిపీట్ అయింది. ఓ అమ్మాయి తాను ఎంచుకున్న రంగంలో ఎదగాలంటే ఎన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సవాళ్ళు ఎదుర్కోవటంలో ఫ్యామిలీ నుంచి, స్నేహితుల నుంచి వచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది. సవాళ్ళు ఎదుర్కొనే అమ్మాయిల పరిస్థితి ఏమిటో చెప్పేదే ‘డియర్ కామ్రెడ్’ సినిమా. లిల్లీ(రష్మిక మందన) స్టేట్ లెవల్ క్రికెట్ ప్లేయర్. జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాలనే లక్ష్యంతో ముందుకెళుతుంది. ఆ దశలోనే ఆమెకు ఇబ్బంది ఎదురవుతుంది. ఆట అద్భుతంగా ఆడుతున్నా జాతీయ స్థాయికి సిఫారసు చేయాలంటే తనతో ఓ రోజు గడపాలని కోరతాడు రాష్ట్ర స్థాయి క్రికెట్ బోర్డు ఛీఫ్.
అక్కడ నుంచి బయటకు వచ్చి అన్యమనస్కంగా నడుస్తున్న లిల్లీని రోడ్డుపై ఓ కారు డీకొడుతుంది. దీంతో డిప్రెషన్ కు వెళ్ళి పోతుంది. బాబీ (విజయ దేవరకొండ) లిల్లీ డిప్రెషన్ ను దూరం చేసినా..క్రికెట్ పై లిల్లీ ఏ మాత్రం ఫోకస్ పెట్టదు. విషయం తెలుసుకున్న బాబీ క్రికెట్ చీఫ్ పై దాడి చేయటంతో పాటు లిల్లీతో పోలీస్ట్ స్టేషన్ లో ఫిర్యాదు చేయిస్తాడు. అక్కడే అసలు సంఘర్షణ ఎదురవుతుంది. పోలీస్ స్టేషన్ కు వద్దని ఫ్యామిలీ ఒత్తిళ్ళు ఒక వైపు .. మరో వైపు లిల్లీపై మీడియా చిలువలు పలవల ప్రచారం, లిల్లీ కోసం బాబీ పోరాటం. ఎటువైపు మొగ్గుచూపాలో తెలియని సంఘర్షణ ఎదుర్కొనే పాత్రలో రష్మిక తన సత్తా చాటింది. ఫస్టాఫ్ లో కొన్ని చోట్ల విజయ దేవరకొండను రష్మిక డామినేట్ చేసిందనే తరహాలో ఉంది ఆమె నటన.
ఫస్టాఫ్ సినిమా కూల్ గా నడిచిపోతుంది. సెకండాఫ్ లో మాత్రం కాస్త సాగదీసినట్లు కన్పిస్తుంది. విజయ దేవరకొండ, రష్మికల లవ్ ట్రాక్ లో కొత్తదనం ఏమీ లేదు. కాకపోతే ముందు అక్కకు లవ్ లెటర్ ఇచ్చి..తర్వాత తనతో ప్రేమలో పడటం ఏంటి? అంటూ రష్మిక టీజ్ చేయటమే సరదాగా ఉంటుంది. సినిమా క్లైమాక్స్ లో లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి రాష్ట్ర క్రికెట్ బోర్డు చీఫ్ పై బీసీసీఐ నియమించిన విచారణ కమిటీ సీన్ మొత్తం సినిమాలోనే హైలైట్ గా నిలుస్తుంది. కొన్నిసార్లు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన అర్జున్ రెడ్డి సినిమాను గుర్తుచేస్తుంది. ఓవరాల్ గా చూస్తే ‘డియర్ కామ్రెడ్’ సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని అమ్మాయిలకు ఓ సందేశాన్ని ఇచ్చిన మూవీ.
రేటింగ్. 2.75/5