Telugu Gateway
Politics

ఎమ్మెల్యేల రాజీనామా లేఖలు చించేసిన శివకుమార్

ఎమ్మెల్యేల రాజీనామా లేఖలు  చించేసిన శివకుమార్
X

కర్ణాకటలో రాజకీయం గంట గంటకూ మారుతోంది. ఈ తరుణంలో ఆ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీ కె శివకుమార్ చేసిన పని కలకలం రేపుతోంది. సంకీర్ణ ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతున్న యడ్యూరప్ప తాజాగా శివకుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా లేఖలను శివకుమార్ చింపేశారని ఆయన ఆరోపించారు. అయితే దీనిపై శివకుమార్ కూడా స్పందించారు. ఈ విషయంలో తాను జైలుకు పోవటానికి కూడా రెడీ అని వ్యాఖ్యానించారు. అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామా పత్రాలను తాను చింపేసిన మాట నిజమేనని డీకే శివకుమార్ ఒప్పుకున్నారు. ఇందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. పార్టీని, తన మిత్రులను కాపాడుకునేందుకు ఆ విధంగా చేశానని, ఒక పార్టీ కార్యకర్తగానే తాను ఆపని చేశానని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు అసమ్మతి ఎమ్మెల్యేలు ఇవాళ ఉదయం తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు సమర్పించేందుకు వెళ్లారు. విషయం తెలిసిన శివకుమార్ అక్కడకు చేరుకుని అసమ్మతి ఎమ్మెల్యేలను కులుసుకుని కొందరి రాజీనామా పత్రాలను చింపేశారు.

'నేను ఎందుకు అలా చేయకూడదు? వాళ్లు ఫిర్యాదు చేసుకుంటే చేసుకోనీయండి. నన్ను కటకటాల వెనక్కి పంపాలని అనుకుంటే, అందుకు నేను సిద్ధమే. ఇప్పటికే నేను అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాను. ఇలాంటి వాటిని ఖాతరు చేసేది లేదు. నేను పెద్ద రిస్కే చేశాను. చేయలేదని అనడం లేదు. దీన్ని కొందరు రికార్డ్ చేస్తారని కూడా నాకు తెలుసు. వాటిని విడుదల చేయనీయండి' అన్నారు. సొంత పార్టీని, మిత్రులను, తనతో ఉన్న వాళ్లను రక్షించుకోవడం తన కర్తవ్యమని డీకే అన్నారు. 'వాళ్లు నెగ్గడానికి, వారి తరఫున ఎన్నికల్లో ప్రచారానికి చాలా కష్టపడ్డాను. వారి విజయం నా విజయంగా భావించి పనిచేశాను. ఒక పార్టీ కార్యకర్తగా నేను ఆ పని చేశాను. వారు తప్పుదారి పట్టకుండా చూడటం నా పని' అని శివకుమార్ పేర్కొన్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలు తాను చేసిన పనిని అర్ధం చేసుకుంటారని, వివేకంతో ఆలోచిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.

Next Story
Share it