Telugu Gateway
Andhra Pradesh

చింతమడక ‘బంగారుతునక’ కావాలి

చింతమడక ‘బంగారుతునక’ కావాలి
X

తెలంగాణ సీఎం కెసీఆర్ మరోసారి తన తురుపుముక్క ‘బంగారు తునక’ అస్త్రాన్ని బయటకు తీశారు. గతంలో ఆయన పలు సందర్భాల్లో ఆయన ఈ పదప్రయోగం చేశారు. పలు నగరాలను అద్దంలాగా..బంగారు తునకలాగామారుస్తామని ప్రకటించారు. సోమవారం తన సొంతూరు చింతమడకలో పర్యటించి ఆ గ్రామ ప్రజలపై ఆయన వరాల జల్లు కురిపించారు. చింతమడక గడ్డపై పుట్టడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన గ్రామ ప్రజలతో ఆత్మీయ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ..‘నన్ను ఇంతటివాడిని చేసిన చింతమడక గ్రామస్తులకు నమస్కారం. చింతమడక వాస్తు అద్భుతం. ఈ గడ్డపై పుట్టడం నా అదృష్టం. చింతమడకను చింతలు లేకుండా చేస్తా. మూడు, నాలుగు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తవ్వాలి. గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు చేయిస్తాం. వైద్యానికి కావాల్సిన ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. చింతమడక నుంచే ఆరోగ్య సూచిక తయారీకి నాంది పలకాలి. క్షణాల్లో వైద్యం అందేలా తెలంగాణ మారాలి. గ్రామంలో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల లబ్ది చేకూరాలి. రైతుబంధు, రైతుబీమా సౌకర్యం కల్పించిన రోజు చాలా సంతోషపడ్డాను. ఈ పథకాలు దేశంలో ఎక్కడా లేవు. ఈ పథకాలు పేద కుటుంబాలకు అండగా ఉన్నాయి. చింతమడక చాలా మంచి ఊరు. ఊరు బాగుపడాలంటే ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలి. ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని బాగు చేశాను.

మీకు మంచిగా పని చేసే జిల్లా కలెక్టర్‌ ఉన్నాడు. ఒక్క చింతమడకే కాదు... నియోజకవర్గమంతా అభివృద్ధి చేస్తాం. చింతమడక ఊరంతా ఆరోగ్య పరీక్షలు చేసేందుకు శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వైద్యం అందిస్తాం. చింతమడకలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తా. గ్రామంలో నాలుగు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి’ అని ఆదేశించారు. అంతకు ముందు గ్రామంలోని బాల్య స్నేహితులను సీఎం కేసీఆర్‌ అప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామస్తులు ఇచ్చిన వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా కెసీఆర్ సిద్ధిపేట, దుబ్బాక నియోజకవర్గాలపై కూడా పలు వరాలు ప్రకటించారు.

Next Story
Share it