Telugu Gateway
Andhra Pradesh

పగులుతున్న చంద్రబాబు జమానా స్కాంల పుట్టలు!

పగులుతున్న చంద్రబాబు జమానా స్కాంల పుట్టలు!
X

జగన్ సర్కారు నిర్ణయంతో ఎంత మంది మంత్రులు చిక్కుల్లో పడతారు?. ఎంత మంది అధికారుల మెడకు అవినీతి వ్యవహారం చుట్టుకుంటుంది. ఏపీలోని అధికార వర్గాల్లో ఇప్పుడు అదే హాట్ టాపిక్. ఇది ఒకెత్తు అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించిన మంత్రివర్గ ఉపసంఘం పరిశీలనలో స్కాంలు పుట్టలు పుట్టలుగా బయటపడుతున్నాయి. ఫైళ్ళలో కన్పించే విషయాలు చూసి కళ్ళు తేలేయాల్సి వస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు జమానాలో ముఖ్యంగా సాగునీటి శాఖ, ఐటి, మునిసిపల్, వ్యవసాయ శాఖ, మౌలికసదుపాయాల శాఖ, విద్యుత్ వంటి కీలక శాఖల్లో దోపిడీ యధేచ్చగా సాగినట్లు గుర్తించారు. ఉదాహరణకు బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ ఏపీలో డ్రిప్ ఇరిగేషన్ సేవలు అందించటానికి 330 కోట్ల రూపాయల అంచనా తో సేవలు అందించటానికి ముందుకొచ్చింది. ఇదే సంస్థ కర్ణాటకలో 320 కోట్లతో సేవలు అందిస్తోంది. లాజిస్టిక్స్ తదితర ఖర్చులు కలుపుకుని మరో పది కోట్లు జత చేసి 330 కోట్లతో సేవలు అందిస్తామని ప్రకటించింది. కానీ సర్కారు మాత్రం దాన్ని ఏకంగా 600 కోట్ల రూపాయలకు పెంచేసింది.

రెయిన్ గన్స్ విషయంలోనూ అదే జరిగింది. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి...భారీ మొత్తం వెచ్చించి అతి తక్కువ ప్రయోజనం కల్పించారు. ఉదాహరణకు పది వేల ఎకరాలకు సరిపోయే రెయిన్ గన్స్ కొనుగోలు చేసి కేవలం వెయ్యి ఎకరాలకు మాత్రమే వాడారని మంత్రుల కమిటీ పరిశీలనలో తేలింది. ఇదొక్కటే కాదు..విశాఖపట్నంలో దుబాయ్ కు చెందిన లూలూ గ్రూప్ కన్వెన్షన్ సెంటర్, మెగా మాల్ నిర్మాణం కోసం విశాఖపట్నం అర్భన్ డెవలప్ మెంట్ అథారిటీ (వుడా) ఉన్నతాధికారులు అభ్యంతరం చెప్పినా కూడా వందల కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కేటాయించేలా అప్పటి ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేశారు. అసలు లూలూ గ్రూప్ నకు ప్రాజెక్టు అప్పగించటమే పెద్ద స్కామ్ అయితే..విశాఖ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన భూమిని ఓ ప్రైవేట్ సంస్థకు ప్రత్యామ్నాయ భూమి కింద అప్పగించటం అప్పట్లోనే వివాదం రేపుతోంది. ఈ వ్యవహారంపై కూడా మంత్రలు సబ్ కమిటీ దృష్టి పెట్టింది. దీంతో పాటు విజయవాడ, విశాఖపట్నంలో ఐటి సంస్థలకు భూ కేటాయింపులు..అస్మదీయ సంస్థలకు కల్పించిన రాయితీలు విషయంలో కూడా పలు ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించారు.

విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూమిని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు కేటాయించటం, ఫిన్ టెక్ వ్యాలీపై చేసిన వ్యయం, టవర్ల నిర్మాణం, విజయవాడలో ఓ సంస్థకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం వంటి అంశాలు పరిశీలనలో ఉన్నాయి. దీంతోపాటు కాకినాడ ప్రత్యేక ఆర్ధిక మండలిలో వైఎస్ హయాంలో క్యాప్టివ్ అవసరాల కోసం కేటాయించిన ఓడరేవును చంద్రబాబు సర్కారు వాణిజ్య అవసరాలకు మార్పు చేస్తూ జీఎంఆర్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో ముందే రేట్లు ఎక్కువ ఇవ్వటం ఒకెత్తు అయితే..తర్వాత కొన్ని సంస్థలకు అత్యవసరం పేరుతో అదనపు చెల్లింపులు చేసిన వ్యవహారం మంత్రివర్గ ఉపసంఘం ఫోకస్ పెట్టింది. కీలక మైన శాఖలు అన్నింటిలో మెగా స్కామ్ లే జరిగాయని..వీటి అన్నింటిని లెక్కతేల్చి విషయాలు బహిర్గతం చేస్తే రాష్ట్ర ప్రజలు షాక్ కు గురవుతారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

ఫైబర్ గ్రిడ్ పేరుతో సాగిన దోపిడీ వ్యవహారం అంతా కూడా సబ్ కమిటీ పరిశీలనలో బహిర్గతం కానుంది. అమరావతి డిజైన్ల చెల్లింపులు కూడా ఓ స్కామ్ గానే మారింది. స్కామ్ లకు పెద్దన్నగా అమరావతిలో సింగపూర్ సంస్థలతో కుదుర్చుకున్న స్విస్ ఛాలెంజ్ ఒప్పందం నిలుస్తుందని చెబుతున్నారు. వీటితోపాటు ఎంపిక చేసిన సంస్థలకు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వటం, ఈ రాయితీల మంజూరులో జరిగిన కుంభకోణాలు వెలికితీయనున్నారు. కియా సంస్థకు ఇచ్చిన భూమి చదును చేసేందుకు ఏపీఐఐసి చేసిన వ్యయం కూడా ఓ పెద్ద స్కాంగా మారిందని గతంలోనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ సంగతిని కూడా సబ్ కమిటీ నిగ్గుతేల్చనుంది. అయితే ఈ వ్యవహారాలతో సంబంధం ఉన్న కొంత మంది అధికారులు ఇప్పుడు కూడా కీలకంగా ఉండటంతో అవి ఏ మేరకు బయటకు వస్తాయి అన్న సందేహాలు మాత్రం కొంత మంది అధికారుల్లో వ్యక్తం అవుతోంది.

Next Story
Share it