Telugu Gateway
Andhra Pradesh

అసెంబ్లీలో జగన్ వర్సెస్ చంద్రబాబు

అసెంబ్లీలో జగన్ వర్సెస్ చంద్రబాబు
X

అసెంబ్లీలో మంగళవారం నాడు కాపు రిజర్వేషన్ల అంశం పెద్ద దుమారమే సృష్టించింది. చివరకు వివాదం పెద్దది కావటం స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం నాడు సభను అర్థారంతరంగా బుధవారానికి వాయిదా వేశారు. కాపు రిజర్వేషన్ల అంశంలో సీఎం జగన్ తన వైఖరి ఏంటో చెప్పాలని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కోరటం వివాదానికి కారణం అయింది. ఈ అంశంపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడిలా తాము మోసాలు చేయబోమని..మేనిఫెస్టోలో చెప్పిందే చేస్తామని ప్రకటించారు. మోసం చేయటం, అబద్ధాలు చెప్పటం తనకు అలవాటులేదన్నారు. కేంద్రం అగ్రవర్ణ పేదలకు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లను ఇస్టానుసారం మార్చటం సాధ్యం కాదన్నారు. కాపులను మోసం చేయటం వల్లే గత ఎన్నికల్లో టీడీపీకి సీట్లు తగ్గాయన్నారు. కాపులు ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్ని సీట్లు వచ్చాయని చంద్రబాబును ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రశ్న వేసే ముందుకు కనీసం చంద్రబాబు తానేమి చేశారో ఆలోచించుకోరా? అని జగన్ ప్రశ్నించారు.

ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా చంద్రబాబు వైఖరిలో ఎలాంటి మార్పులేదన్నారు. ప్రస్తుత బడ్జెట్ లో కాపులకే రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించామని..చంద్రబాబునాయుడు కేవలం కాపులను ఓటు బ్యాంకుగా చూసి..ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదని ద్వజమెత్తారు. అంతకు ముందు చంద్రబాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామని తెలిపారు. కాపు రిజర్వేషన్లపై మోసం చేశాడని తనను విమర్శించారని, మోసం చేసింది వైఎస్సేనని చంద్రబాబు గుర్తు చేశారు. కాపులకు రిజర్వేషన్ అంశాన్ని 2004, 2009లో మేనిఫెస్టోలో పెట్టి వైఎస్‌ ఏం చేశారని ఆయన వైసీపీని ప్రశ్నించారు. 5 శాతం రిజర్వేషన్లకు వైసీపీ కట్టుబడి ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ జగన్ తీవ్రంగా స్పందించారు. సినిమాలో కనిపించే విలన్‌ క్యారెక్టర్‌, మోసగాడు... అసెంబ్లీకి వస్తే చంద్రబాబులా ఉంటాడని అన్నారు. అచ్చెన్నాయుడు భూమి మీద అంత లావు, ఎత్తు పెరిగాడు కానీ బుర్ర ఎందుకు పెరగలేదో తనకు అర్థం కావడం విమర్శించారు. అచ్చెన్నాయుడికి ఆ భారీ సైజు, గొంతు ఉంది కాబట్టి సభకు పదే పదే అడ్డుపడుతున్నాడని జగన్‌ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చరిత్ర తవ్వుతూ పోతే 1983నాటి విషయాలు చెప్పుకోవాల్సి వస్తుందని, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడం లాంటివి వస్తాయని జగన్‌ విమర్శించారు. చంద్రబాబు చేసిన పనివల్లే కోర్టులో కేసు నడుస్తోందని, కౌన్సిలింగ్‌లో సీట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని సీఎం విమర్శించారు.

Next Story
Share it