Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ఇంటి చుట్టూ రాజకీయం ఇంకెంత కాలం?

చంద్రబాబు ఇంటి చుట్టూ రాజకీయం ఇంకెంత కాలం?
X

చంద్రబాబు ఇంటిపై ఇంకెంత కాలం రాజకీయం చేస్తారు?. ఏపీలో అసలు ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలు..ఫోకస్ పెట్టాల్సిన అంశాలే లేవా?. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులు దాటింది. నిజంగా చంద్రబాబు నివాసం ఉంటుంది అక్రమ నిర్మాణం అయితే ప్రజావేదిక తరహాలో దాన్ని కూడా కూల్చివేయాలి. గతంలో మాజీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పినట్లు అది ప్రభుత్వ స్థలం..భవనం అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. లేదంటే కోర్టు తీర్పు వచ్చేవరకూ అయినా ఎదురుచూడాలి. అది ప్రభుత్వ స్థలం అని..పూలింగ్ లో తీసుకున్నామని చంద్రబాబునాయుడు కొంత కాలం క్రితం మీడియాతో చెప్పారు. అది నిజమే అని వైసీపీ సర్కారు నమ్మితే..అసలు ఇంటి ఓనర్ లింగమనేని రమేష్ కు సీఆర్ డీఏ నోటీసులు ఎందుకు ఇచ్చినట్లు?. ప్రభుత్వ రికార్డుల్లో ఏమి ఉంది?. దాని ప్రకారమే కదా ప్రభుత్వం ముందుకు సాగాల్సింది. నేతలు గతంలో మాట్లాడిన మాటలే ఆధారాలుగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోగలుగుతాయా?. వాటికి చట్టబద్ధత ఉంటుందా?. తప్పు ఎవరు చేసినా సర్కారు చర్యలు తీసుకుంటే ఎవరూ ఆక్షేపించరు. కానీ అసలు ఏపీలో సమస్యలే ఏమీ లేనట్లు రోజుల తరబడి ఆ ఇంటి చుట్టూనే రాజకీయం చేయటం వల్ల ఎవరికి ప్రయోజనం?.

గత ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమి పాలై 23 సీట్లకు పరిమితం అయింది. ఇప్పుడు ఆ పార్టీ కోలుకోవటానికి ఎంత సమయం పడుతుందో కూడా తెలియదు?. ఈ తరుణంలో చంద్రబాబు ఇంటిపై అనవసరపు రాజకీయం ఎందుకు?. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేస్తున్న హంగామా పూర్తి రాజకీయంతో నిండిపోయిందనే చెప్పాలి. సీఆర్‌డీఏ నోటీసులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా స్పందించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి డిమాండ్ చేస్తున్నారు? చంద్రబాబు స్పందించి ఇళ్ళు మాదే అంటే వదిలేస్తారా?. అసలు దానిపై చంద్రబాబు స్పందించాల్సిన అవసరం ఏముంది?. ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకు సాగాలి? అంతే కానీ చంద్రబాబు స్పందనకు దానికి సంబంధం ఏమిటి?. ఆదివారం నాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ఉంటున్న ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చేసినట్టు గతంలో లింగమనేని రమేష్ చెప్పారు. కానీ లింగమనేని ఇప్పుడు మాటమార్చి.. ఆ ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు.

కొత్తగా ఆ ఇళ్లు తనదేనని లింగమనేని ఎలా చెబుతారు?. తాను నివాసం ఉంటున్న ఇళ్లు ప్రభుత్వానిదేనని చంద్రబాబు 2016 మార్చి 6వ తేదీన శాసనసభలో వెల్లడించారు’ అని తెలిపారు. సీఎం పదవి పోయాక ప్రభుత్వ ఇళ్లు ఖాళీ చేయాలనే కనీస జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకుండా పోయిందని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెబుతున్నట్లు చంద్రబాబు, లింగమనేని రమేష్ లు ఆ ఇళ్ళు ప్రభుత్వానిదే అని చెపితే..అసలు సీఆర్ డీఏ ఎందుకు లింగమనేని రమేష్ కు నోటీసులు ఇచ్చింది?. అందుకు ఆధారాలు సర్కారు దగ్గర ఉంటే ప్రజావేదిక లాగా ఆ అక్రమ ఇంటిని కూడా పడగొట్టవచ్చు కదా?. కానీ అవన్నీ వదిలేసి వివాదం చేయటం వెనక రాజకీయం ఏమిటి?

Next Story
Share it