జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని..నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో గట్టిగా మాట్లాడితే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. సభలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా?. సభలో తాము మాట్లాడుతుంటే వెంటనే మైక్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై గతంలో తెలంగాణ వైఖరిని జగన్ తప్పుపట్టారు. ఇప్పుడు కేసీఆర్‌ను పొగుడుతున్నారు. జగన్-కేసీఆర్ మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్ జరిగింది. సీఎం స్థానానికి ఉన్న హుందాతననాన్ని జగన్ నిలబెట్టుకోవాలి. రాష్ట్రాలు శాశ్వతం.. కేసీఆర్, జగన్ శాశ్వతం కాదు. అవినీతిపై జగన్ మాట్లాడుతుండటం హాస్యాస్పదం" అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్‌కు.. తెలంగాణ సీఎం కేసీఆర్ నిధులు ఇచ్చారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
నాడు నిధులు ఇచ్చారనే జగన్.. కేసీఆర్ రుణం తీర్చుకుంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేసీఆర్ కోసం భావితరాల భవిష్యత్‌ను తాకట్టు పెడతారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్‌రెడ్డి, చెన్నారెడ్డిలాంటి వాళ్లకే నేను సమాధానం చెప్పాను. హుందాతనం తప్పి ప్రవర్తించడం నా చరిత్రలో లేదు. జగన్ ఈ విషయం తెలుసుకోవాలి. సభ్యత మరిచి మాట్లాడటం సరికాదు. ఇలా నోరు పారేసుకొని అదుపుతప్పి మాట్లాడే ముఖ్యమంత్రిని నేను ఎప్పుడూ చూడలేదు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎవరూ భయపడరు?. ప్రతి రోజూ అసెంబ్లీలో పులివెందుల పంచాయితీనే జరుగుతోంది. జగన్ చెబుతున్నట్లు నీళ్ల కోసం తెలంగాణపై ఆధారపడితే ఏపీలో భావితరాలు దెబ్బతింటాయి. మన నీళ్ల కోసం ప్రాజెక్ట్ లు అక్కడ కట్టి..వాళ్లకు వాటా ఇవ్వడం సరికాదు" అని చంద్రబాబు సూచించారు. పోలవరం టెండర్ల విషయంలో కావాలనే బురదజల్లుతున్నారని విమర్శించారు.