జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలే హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వ చంద్రబాబు అక్రమాలను ఎండగట్టాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే టీడీపీ చేతనైతే విచారణలు చేసుకోండి అని సవాళ్లు విసురుతోంది. దీనికి తోడు కేంద్రంలోని మంత్రులు..నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర వ్యాఖ్యలు చేసిన బిజెపి ఇప్పుడు తన స్టాండ్ మార్చుకుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం నాడు చంద్రబాబు అసెంబ్లీలోని తన ఛాంబర్ లో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. సీఎం జగన్ తన చెట్టుని తానే నరుక్కుంటున్నారని వ్యాఖ్యానించారు.
పోలవరం విషయంలో విజయసాయి సీబీఐ ఎంక్వైరీ అడిగితే.. అవసరం లేదని కేంద్ర మంత్రి చెప్పారు. పునరావాసంలో అవకతవకల గురించి జీవీఎల్ ప్రస్తావిస్తే.. పోలవరానికి ఎంత ఇస్తారని రమేష్ అడిగారని తెలిపారు. వాళ్లల్లోనే వాళ్లకు పొంతన లేకుండా పోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పోలవరానికి ఫైనాన్స్ క్లియరెన్స్ రాలేదన్నారు. ఆర్అండ్ఆర్ రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం అంటోందన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం.. వైసీపీ మాట్లాడటం లేదన్నారు. కియా పరిశ్రమను వైఎస్ తెచ్చారని.. పట్టిసీమ నీళ్లు మచిలీపట్నానికే ఉపయోగ పడలేదని.. గోదావరికే కృష్ణా నీళ్లు తీసుకెళ్లినట్టు వైసీపీ మాట్లాడుతోందని విమర్శించారు.