Telugu Gateway
Andhra Pradesh

ఏపీ ఆస్తులేమీ తెలంగాణకు ఇవ్వలేదు

ఏపీ ఆస్తులేమీ తెలంగాణకు ఇవ్వలేదు
X

హైదరాబాద్ లోని సచివాలయ భవనాలను ఉపయోగించటం లేదనే తెలంగాణ సర్కారుకు ఇచ్చేశామని ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఏపీ ఆస్తులను తెలంగాణకు ఇచ్చేస్తున్నారంటూ టీడీపీ లేవనెత్తిన అంశాలపై సర్కారు జవాబు ఇచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఆహ్వానం మేరకే ఏపీ సీఎం, ముఖ్యమైన కేబినెట్‌ మంత్రులు, అధికారులు వెళ్లి.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సంబంధించిన సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్‌లోని భవనాలు 2024 వరకు మనకు చెందుతాయని, ఆ తర్వాత అవి తెలంగాణకే చెందుతాయని అన్నారు. పదేళ్ల కాలపరిమితి ఉన్నా..గతంలో చంద్రబాబు హుటాహుటిన ఎందుకు అమరావతికి పరిగెత్తుకొని వచ్చారని ప్రశ్నించారు.

పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి.. ఓటుకు కోట్లు కేసులో వీడియోలకు అడ్డంగా దొరికిపోవడంతోనే చంద్రబాబు అమరావతికి పారిపోయి వచ్చిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ భవనాలు కావాలంటే నాలుగేళ్లపాటు మున్సిపల్‌ బిల్లులు, కరెంటు, వాటర్‌ బిల్లులు కట్టాల్సి ఉంటుందని, గత ఐదేళ్లూ వాడని భవనాలను.. తిరిగి అక్కడికి వెళ్లి ఇంకో ఐదేళ్లు వాడే పరిస్థితి లేదని, ఎలాగైనా 2024లో ఆ భవనాలు తెలంగాణకు తిరిగి ఇవ్వాల్సినవే కనుక ఇచ్చివేశామని తెలిపారు. నీళ్లు, నిధుల పంపకాల వంటి పెద్ద పెద్ద విషయాల్లో సామరస్యంగా పంపకాలు చేసుకోవాలన్న సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Next Story
Share it