Telugu Gateway
Politics

యడియూరప్ప అసెంబ్లీలోనూ గెలిచారు

యడియూరప్ప అసెంబ్లీలోనూ గెలిచారు
X

సస్పెన్స్ వీడింది. కర్ణాటకలో యడియూరప్ప సర్కారు విశ్వాసపరీక్షలో విజయం సాధించింది. దీంతో కర్ణాటకలో తిరిగి కమళదళం అధికారంలోకి అధికారికంగా వచ్చినట్లు అయింది. స్పీకర్ రమేష్ కుమార్ రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయటంతో లెక్కలు యడియూరప్పకు అనుకూలంగా మారాయి. అయితే అధికార, విపక్షాల మధ్య నెంబర్ల తేడా చాలా తక్కువగా ఉండటంతో ఈ సర్కారు ఎంత కాలం సుస్ధిరంగా సాగగలదు అన్న సందేహాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. అయితే ఉప ఎన్నికలు జరిగి..అందులో ఎక్కువ సీట్లను బిజెపి దక్కించుకుంటే యడియూరప్ప సర్కారు దీర్ఘకాలం కొనసాగటానికి మార్గం సుగమం అవుతుందని చెప్పొచ్చు. సోమవారం జరిగిన బలపరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 106 మంది సభ్యులు ఓటేశారు. దీంతో మ్యాజిక్‌ ఫిగర్‌ను యడియూరప్ప సునాయాసంగా ఛేదించగలిగారు. సభకు కాంగ్రెస్‌-జెడీఎస్ సభ్యులు కూడా హాజరయ్యారు. వీరంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ.. విశ్వాస పరీక్షలో సర్కార్‌ విజయం సాధించింది. బీజేపీకి ఉన్న 105 మందితో పాటు ఓ స్వతంత్ర ఎమ్మెల్యేతో కలుసుకుని బలం 106కి చేరింది. దీంతో మ్యాజిక్‌ ఫిగర్‌ 104 కంటే రెండు ఓట్లను ఎక్కువగా సాధించి బలపరీక్షలో గెలుపొందింది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 మంది సభ్యులు ఓటు వేశారు. మూజువాణి పద్దతిలో స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ ఓటింగ్‌ను చేపట్టారు. ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ ఉండడంతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం విజయం సాధించిందని స్పీకర్‌ ప్రకటించారు. అనంతరం సీఎం యడియూరప్ప సభలో సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రజల విజయమన్నారు. విశ్వాస పరీక్షకు ముందు సభలో యడియూరప్ప మాట్లాడుతూ.. బల నిరూపణలో తమ ప్రభుత్వం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో పాలనలో ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. రైతులకు పెద్దపీఠ వేస్తామని స్పష్టం చేశారు. ప్రజల, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని సీఎం పేర్కొన్నారు. చర్చలో భాగంగా కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య మాట్లాడుతూ.. యడియూరప్ప వ్యాఖ్యలను తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపాలని సూచించారు. రైతుల సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఎంతో చేశాయని ఆయన గుర్తుచేశారు.

Next Story
Share it