Telugu Gateway
Politics

బిజెపి టార్గెట్ కెసీఆర్ వయా కాళేశ్వరం!

బిజెపి టార్గెట్ కెసీఆర్ వయా కాళేశ్వరం!
X

తెలంగాణలో ఎలాగైనా బలపడేందుకు బిజెపి సర్వశక్తులు ఒడ్డుతోంది. లోక్ సభ ఎన్నికల్లో నాలుగు సీట్లను దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన ఆ పార్టీ దూకుడు పెంచింది. ఓ వైపు కెసీఆర్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ను దెబ్బ మీద దెబ్బ కొడుతూ లేవకుండా చేస్తున్నారు. అందుకు ఆయన ఫిరాయింపులు..విలీనాల మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే కాంగ్రెస్ బలహీనం అయ్యే కొద్దీ ఆ స్పేస్ ను తాము ఆక్రమించుకుని కెసీఆర్ కు ప్రత్యామ్నాయం కావాలని బిజెపి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. బిజెపి తెలంగాణపై ‘ప్రత్యేక ఫోకస్’ పెట్టిందనే విషయం స్పష్టంగా కన్పిస్తోంది. అదే సమయంలో బిజెపి నేతలు కూడా గతానికి భిన్నంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై విమర్శల స్పీడ్ పెంచారు. ఇంటర్మీడియట్ బోర్డు ఘోర వైఫల్యాలు..విద్యార్ధుల మరణాలపై జోక్యం చేసుకోవాలని తెలంగాణ బిజెపి అధ్యక్షడు కె. లక్ష్మణ్ ఢిల్లీలో స్వయంగా రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలసి మరీ వినతిపత్రం అందజేశారు. ఇది ఒకెత్తు అయితే బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘనందన్ రావు కాళేశ్వరానికి సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తూ బహిరంగ లేఖ విడుదల చేయటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ గత కొంత కాలంగా ఆరోపిస్తోంది. ఇఫ్పుడు బిజెపి కూడా అదే లైన్ లో తీవ్రమైన ఆరోపణలు చేయటంతో పాటు పలు ప్రశ్నలు సంధిస్తూ బహిరంగ లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేయటం విశేషం. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే కేంద్రంలోని బిజెపి సర్కారు కూడా ఈ అంశంపై ‘ఫోకస్’ పెట్టినట్లు కన్పిస్తోందని చెబుతున్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే..బిజెపి మాత్రం అందులో జరుగుతున్న అవినీతి సంగతి తేల్చండి ముందు అంటూ ఎదురుదాడికి దిగుతోంది. రఘునందర్ రాసిన బహిరంగ లేఖలోని ముఖ్యాంశాలు...కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 70 శాతం పనులు ఓ సంస్థకు కట్టబెట్టి పరోక్షంగా ఎవరిని అంబానీలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందో ప్రజలకు బహిరంగగా చెప్పాలి.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలోని 18లో నిర్మించతలపెట్టిన టన్నెల్, ఒక లిఫ్ట్ ను కాలువలుగా మార్చి రెండు లిఫ్ట్ లు గా పెంచటం ఎవరి ప్రయోజనాల కోసం?. మూడో టీఎంసీ నీరు కోసం ఆగమేఘాల మీద మొన్నటి కేబినెట్ లో సుమారు 14 వేల కోట్లు ఎవరి కోసం అప్రూవల్ ఇచ్చారు?.ఈ విషయంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ మీ కార్యాలయానికి జూన్ 13న ప్రత్యామ్నాయ సూచనలు, సిద్ధిపేట, కరీంనగర్ ప్రజలు నష్టపోకుండా ఇఛ్చిన ప్రాజెక్టు నివేదికను అధ్యయనం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏమిటి?. ఈ ప్రతిపాదనలతో 8వేల కోట్ల తో పని అయ్యే అవకాశం ఉన్నాఎందుకు చర్చించటం లేదు? పైప్ లైన్ల జీవిత కాలం 25 నుంచి 30 సంవత్సరాలే అని, వాటి బదులు ప్రస్తుతం నిర్మిస్తున్న టన్నెల్ పక్కనే మరో టన్నెల్ నిర్మిస్తే సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాల్లో రైతాంగం ఖరీదైన భూమును కోల్పోకుండా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయవచ్చు. ఈ అంశాలన్నీ పక్కన పెట్టి ఎవరి ప్రయోజనా కోసం..ఏ సంస్థ బాగు కోసం ఇదంతా చేస్తున్నారు. ’అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు. ప్రాజెక్టు అవకతవకలపై, తప్పుడు చెల్లింపులపై బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు.

Next Story
Share it