బాబు జమానాలోనే పీపీఏలపై అభ్యంతరాలు..ఏజీ సలహా కోరిన ఈఆర్ సీ
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు ఎక్కడ ఉన్నాయి?. అంతా సవ్యంగానే జరిగింది. సోలార్, విండ్ పవర్ ఒప్పందాల్లో అవకతవకలు ఏమీ లేవు. ఏపీఈఆర్ సీ కూడా ఈ రేట్లను ఒప్పుకుంది. ఇవీ గత కొన్ని రోజులుగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చేస్తున్న వాదన. కానీ తాజాగా ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. అదేంటి అంటే ఏపీఈఆర్ సీ ఛైర్మన్ గా ఉన్న జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ ఇదే ఏడాది ఫిబ్రవరి 27న అప్పటి విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రిటైల్ సప్లయ్ టారిఫ్ ఆర్డర్ ఖరారు కు సంబంధించి చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. పీపీఏలను 25 సంవత్సరాలకు చేసుకోవటం, ముఖ్యంగా విండ్, సోలార్ విద్యుత్ కు సంబంధించి రేట్లు తగ్గినందున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయని తెలిపారు.
ఈ మేరకు భాగస్వామ్యపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాల వివరాలను కూడా అజయ్ జైన్ కు రాసిన లేఖకు జత చేశారు. ఈ అంశాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని ఏపీఈఆర్ సీ ఛైర్మన్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ పీపీఏలను ఐదేళ్ళకు లేదా నిర్దేశిత గడువులోపు తగ్గించటం వంటి అంశాలపై అభిప్రాయం తీసుకోవాలని కోరారు. అడ్వకేట్ జనరల్ సలహా తీసుకుంటే దానికి అనుగుణంగా పీపీఏలపై సమీక్షకు తీసుకోవాల్సిన చర్యలపై కమిషన్ తగు నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే ఏపీఈఆర్ సీ ఛైర్మన్ రాసిన లేఖపై అప్పటి ప్రభుత్వం స్పందించలేదనే అనుకోవాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా ప్రైవేట్ సంస్థలకు మేలు చేసి పెట్టేందుకే సర్కారు దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకున్నాయని అర్ధం అవుతోందని చెబుతున్నారు.ఏపీఈఆర్ సీ ఛైర్మన్ రాసిన లెటర్ కాపీని కూడా ఈ వార్తలో చూడొచ్చు.