అనుష్క@14

ఏంటి ఇది అనుకుంటున్నారా?. గత కొంత కాలంగా ‘సైలంట్’గా ఉన్న అనుష్క మళ్ళీ యాక్షన్ లోకి వచ్చేసింది. తెలుగు తెరపై ఎన్నో సంచలన పాత్రలు..సంచలన విజయాలు అందుకున్న ఈ భామ పరిశ్రమలోకి ప్రవేశించి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకున్న ఆమె చేస్తున్న కొత్త సినిమా ‘నిశ్శబ్దం’ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కేవలం నాట్య భంగిమలో ఉన్న చందంగా రెండు చేతులను మాత్రమే చూపించారు. ఈ చేతులకు మాత్రం ఫుల్ కలర్లు ఉన్నాయి. ఈ సినిమాలో అనుష్క దివ్యాంగరాలి పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇదే సినిమాలో మరో హీరోయిన్ అంజలి కూడా ఉంది.
ఆమె పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఆర్. మాధవన్, మైఖేల్ మ్యాడసన్, షాలినీ పాండే ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాత. ప్రస్తుతం అమెరికాలోని సియాటిల్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అమెరికాలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్, మలయాళ భాషల్లో ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.