Telugu Gateway
Politics

సచివాలయం కూల్చొద్దు..అఖిలపక్షానిది అదే మాట

సచివాలయం కూల్చొద్దు..అఖిలపక్షానిది అదే మాట
X

తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణం వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ కొత్త సచివాలయం కట్టాల్సిందే అంటుంటే..విపక్షాలు అన్నీ నో చెబుతున్నాయి. కొంత మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా సచివాలయం కూల్చివేత ప్రతిపాదనపై అంతర్గతంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సర్వీసులో ఉన్నవారు కావటంతో వాళ్ళు బయటకు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఆదివారం నాడు హైదరాబాద్ లో సచివాలయం కూల్చివేత అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీ భవనం చారిత్రాత్మకమైనదని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న అసెంబ్లీ భవనంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఒకేసారి నడిచిన విషయాన్ని గుర్తుచేశారు. మెట్రో నిర్మాణ సమయంలో అసెంబ్లీ ఇమేజ్ కు దెబ్బతగిలేలా నిర్మాణాలు చేయవద్దని కెసీఆర్ వాదించారని..ఇప్పుడు ఆ అసెంబ్లీని కాదని కొత్తది కట్టాల్సిన అవసరం ఏముందని అన్నారు.

నూతన సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బిజెపి ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాట్లాడుతూ సచివాలయం కూల్చివేత, నూతన అసెంబ్లీ నిర్మాణాల ప్రతిపాదనలను బిజెపి వ్యతిరేకిస్తుందని తెలిపారు. టీడీపీ, టీజెఎస్ తోపాటు మిగిలిన పార్టీలు, మేథావులు కూడా సచివాలయం కూల్చివేత ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, టీజెఎస్ అధ్యక్షుడు కోదందరాం, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మాజీ ఎంపీ జి. వివేక్ ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.నూతన అసెంబ్లీ, సచివాలయం కూల్చివేతలను అడ్డుకునేందుకు అవసరం అయితే ప్రజా ఉద్యమం నిర్మించాలని అఖిలపక్షం అభిప్రాయపడింది.

Next Story
Share it