Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ఈ విలీన నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తారా?

చంద్రబాబు ఈ విలీన నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తారా?
X

బిజెపిలో టీడీపీ రాజ్యసభపక్ష విలీన నిర్ణయాన్ని తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఛాలెంజ్ చేస్తారా?. పార్టీ ఫిరాయించిన ఎంపీలపై ఫిర్యాదు చేస్తారా?. ఫిర్యాదులపై స్పందన రాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా?. పార్టీతో సంబంధం లేకుండా సభలో ఉన్న నాయకులు ఓ లేఖ ఇస్తే విలీనాలు అలా జరిగిపోతాయా?. ఇవీ ఇఫ్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. తెలంగాణలో జరిగిన విలీనంపై కాంగ్రెస్ హైకోర్టులో పిటీషన్ వేసింది. మరి అలాగే టీడీపీ చేస్తుందా?. లేక ఇప్పుడు కూడా ఇంకా ప్రధాని మోడీతో ఎక్కడ ఢీకొట్టగలం అని వదిలేస్తారా?. వేచిచూడాల్సిందే. టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు ఫిరాయించారు అంటే..ఏవో కేసులు..ఒత్తిళ్ళు ఉన్నాయని అనుకోవచ్చు. కానీ చంద్రబాబుకు నమ్మిన బంటు వంటి గరికపాటి మోహన్ రావు కూడా పార్టీ మారటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీ జీ వెంకటేష్ కు కూడా వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విలీనంపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

ప్రస్తుతం బిజెపిలో చేరిన వారంతా చంద్రబాబు కు చెప్పే పార్టీ మారారని జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా గరికపాటి మోహన్ రావు వంటి వారు బిజెపిలో చేరటానికి బలమైన కారణాలు ఏమీ లేవని చెబుతున్నారు. నిజంగా చంద్రబాబుకు తెలిసే జరిగితే మిగిలిన ఇద్దరు మాత్రం ఎందుకు ఉంటారు? అనే వాదన కూడా ఉంది. అయితే సీతామహాలక్ష్మి తొలుత ఈ జాబితాలో ఉన్నా కూడా చివరి నిమిషంలో ఆమె వెనక్కి తగ్గారు. మరో సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ మాత్రం మొదటి నుంచి బిజెపిలో చేరిక విషయంలో మాత్రం దూరంగా ఉన్నారు. అయితే ఈ ఫిరాయింపుల విషయంలో దేశంలోనే మోడీని ఢీకొట్టిన ఏకైక నాయకుడిని అని చెప్పుకున్న చంద్రబాబు...మరి అదే ధోరణి చూపిస్తారా? లేక రాజీపడతారా? అన్న విషయమే ఇప్పుడు కీలకంగా మారుతుంది. ప్రచారం జరుగుతున్నట్లు చంద్రబాబు ఈ విలీన నిర్ణయాన్ని ఛాలెంజ్ చేయకపోతే మాత్రం అందరిలో ఉన్న అనుమానాలే నిజం అయ్యే అవకాశం ఉందని ఓ టీడీపీ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it